Condoms: 296 మంది వధువులకు ఇచ్చిన మేకప్ కిట్లలో కండోమ్స్, గర్భ నిరోధక మాత్రలు.. మధ్యప్రదేశ్ లో ఘటన

Condoms and Birth Control Pills In Madhya Pradeshs New Wedding Kit
  • ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘సీఎం కన్య వివాహ్/నిఖా యోజన’ కింద సామూహిక వివాహాలు
  • ఒక్కటైన 296 జంటలు.. వధువులకు మేకప్ కిట్లను పంపిన సర్కారు
  • వాటిలో కండోమ్స్, బర్త్ కంట్రోల్ పిల్స్
ప్రభుత్వం ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. వధువులందరికీ ప్రభుత్వం తరఫున మేకప్ కిట్లు అందాయి. ఏముందో అని ఓపెన్ చేసిన నవ దంపతులు.. అందులో ఉన్నవి చూసి కంగుతిన్నారు. ఎందుకంటే.. ఆయా కిట్లలో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు ఉన్నాయి మరి. శుభమా అని పెళ్లి చేసుకుంటే.. ఇదేంటని ఆశ్చర్యపోయారు. మధ్యప్రదేశ్ లోని ఝబువా జిల్లాలో జరిగిందీ ఘటన.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశపెట్టిన ‘సీఎం కన్య వివాహ్/నిఖా యోజన’ అనే పథకాన్ని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 296 జంటలకు సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం కింద నవ దంపతులకు పంపిన మేకప్ కిట్లలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు కనిపించాయి. 

ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో జిల్లా సీనియర్ అధికారి భూర్సింగ్ రావత్ స్పందించారు. తప్పును రాష్ట్ర ఆరోగ్య శాఖపై నెట్టేశారు. కుటుంబ నియంత్రణకు సంబంధించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అధికారులు కండోమ్‌లు, గర్భనిరోధక సాధనాలను పంపిణీ చేసి ఉంటారని అన్నారు.

‘‘కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలను పంపిణీ చేసే బాధ్యత మాది కాదు. కుటుంబ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ మెటీరియల్‌ని అందజేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కన్యా వివాహ్/నిఖా యోజన కింద, మేము నేరుగా రూ.49,000ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తాం. ఆహారం, నీరు, టెంట్ అందించే బాధ్యత మాది. దీని విలువ రూ.6,000. పంపిణీ చేసిన ప్యాకెట్లలో ఏముందో నాకు తెలియదు’’ అని ఆయన వివరణ ఇచ్చారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడానికి ఏప్రిల్ 2006లో ముఖ్యమంత్రి కన్యా వివాహ్/నిఖా యోజనను ప్రారంభించింది. పథకం కింద, ప్రభుత్వం వధువు కుటుంబానికి రూ.55,000 అందిస్తుంది.

గత నెలలో దిండోరిలోని గడ్సరాయ్ ప్రాంతంలో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో కొంతమంది వధువులకు ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చిన ఒక మహిళ.. పెళ్లికి ముందు నుంచే తన కాబోయే భర్తతో కలిసి జీవిస్తున్నట్లు చెప్పింది. వధూవరుల వయస్సును నిర్ధారించడానికి, సికిల్ సెల్ అనీమియాను తనిఖీ చేయడానికి, వారు శారీరకంగా దృఢంగా ఉన్నారని తెలుసుకునేందుకు సాధారణంగా పరీక్షలు నిర్వహిస్తారని డిండోరి చీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు.
Condoms
Birth Control Pills
Madhya Pradesh
New Wedding Kits
Shivraj Singh Chouhan

More Telugu News