YS Jagan: తల్లిని, చెల్లిని కూడా గెంటివేశాడు: జగన్‌పై కొల్లు రవీంద్ర
- ప్యాలెస్ లు, కంపెనీలు ఉన్న జగన్ పెత్తందారీ కాదా అని నిలదీత
- 2004లో ఇల్లు అమ్మే స్థాయి నుండి లక్షల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్న
- బాబాయిపై గొడ్డలి వేటు అంటూ మండిపాటు
- అమరావతిని అందరు గుర్తించినా జగన్ నిర్వీర్యం చేశారని వ్యాఖ్య
ఆరు ప్యాలెస్‌లు, భారతీ సిమెంట్స్, సండూర్ పవర్స్ సహా పదహారు కంపెనీలు ఉన్న ముఖ్యమంత్రి జగన్ పేదవాడు ఎలా అవుతాడో చెప్పాలని మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. 2004 ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోని 1.73 కోట్ల విలువ కలిగిన ఇల్లును అమ్ముకోవడానికి సిద్ధమైన వ్యక్తి తక్కువ సమయంలోనే లక్షల కోట్లు ఎలా సంపాదించాడో చెప్పాలన్నారు. ఇది పెత్తందారీతనం కాదా అని నిలదీశారు.
సొంత బాబాయిపై గొడ్డలి వేటు, హంతకులను కాపాడటం, తండ్రి ఆస్తిలో న్యాయమైన వాటా అడిగిన చెల్లిని, తల్లిని గెంటేయడం, సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు కస్టోడియల్ టార్చర్, దీనిని వీడియో తీయించి ఆనందించడం, ప్రభుత్వాన్ని నిలదీస్తే అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల ధ్వంసం, ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రుల ఫోటోలు తీసేసి తన ఫోటో మాత్రమే పెట్టుకోవడం... ఇవి పెత్తందారి పద్ధతి కాదా అన్నారు.
అన్ని పార్టీలు, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం రాజధానిగా అమరావతిని గుర్తించినప్పటికీ జగన్ నిర్వీర్యం చేశారన్నారు. తన దోపిడీని ఎదుటివారికి అంటగట్టడం జగన్ నైజమన్నారు. ఆయనపై 40 కేసులు ఉంటే 24 కేసులు 420 కేసులేనని ఆరోపించారు. జగన్ ను మించిన పెత్తందారు, దోపిడీదారు దేశంలో లేరన్నారు. దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇది జగన్ పద్ధతి అని విమర్శించారు.