WFI: మా మెడల్స్ ను గంగా నదిలో నిమజ్జనం చేస్తాం.. ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాం: రెజ్లర్ల సంచలన ప్రకటన
- డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లు
- కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో కీలక ప్రకటన
- ఇండియా గేట్ వద్ద దీక్షకు దిగుతామని వెల్లడి
- తమను బిడ్డలు అన్న మోదీ కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా రెజ్లర్లు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట పార్లమెంటుకు ర్యాలీ తీసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం, కేసులు పెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజ్లర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.
తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో తాము సాధించిన మెడల్స్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హరిద్వార్‌లోని గంగా నదిలో నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. ఇండియా గేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. బ్రిజ్ భూషణ్ పై చర్చలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘‘హరిద్వార్‌లోని గంగా నదిలో మా పతకాలను నిమజ్జనం చేస్తాం. ఈ పతకాలు మా ప్రాణాలు, మా ఆత్మలు. వీటిని గంగా నదిలోకి విసిరేసిన తర్వాత జీవించి ఉండటంలో అర్థం లేదు. వీటిని గంగా నదిలో కలిపేసి.. మేము ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం’’ అని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తమను ‘మా బిడ్డలు’ అని అంటూ ఉంటారని, కానీ ఆయన కూడా తమ పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించడం లేదని ఆరోపించారు. తమను అణచివేస్తున్న బ్రిజ్ భూషణ్‌ను నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారన్నారు. ఆయన తళతళ మెరిసే తెల్లని దుస్తుల్లో ఫొటోలకు పోజులిచ్చారని మండిపడ్డారు. ఆ కాంతిలో తాము వెలిసిపోయామని చెప్పారు.
మరోవైపు రెజ్లర్ల ప్రకటనపై హరిద్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ సింగ్ స్పందించారు. తాము రెజ్లర్లను అడ్డుకోబోమని చెప్పారు. ‘‘ఏమైనా చేసేందుకు రెజ్లర్లకు స్వేచ్ఛ ఉంది. పవిత్ర గంగానదిలో మెడల్స్ ను నిమజ్జనం చేయాలని వాళ్లు భావిస్తే.. వారిని మేం అడ్డుకోబోం. ఈ విషయంలో ఉన్నతాధికారుల నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు కూడా రాలేదు’’ అని చెప్పారు.