Asaduddin Owaisi: చైనాపై సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి చూద్దాం.. బీజేపీకి ఓవైసీ సవాల్
- పాత బస్తీలో సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామంటూ గతంలో బండి సంజయ్ వార్నింగ్
- ఈ వ్యాఖ్యలపై తాజాగా మరోమారు కౌంటర్ ఇచ్చిన అసదుద్దీన్ ఓవైసీ
- తెలంగాణ ప్రభుత్వ స్టీరింగ్ తన చేతుల్లో ఉంటే మీకేం నొప్పి అంటూ అమిత్ షాను నిలదీసిన ఎంఐఎం చీఫ్
‘పాత బస్తీలో కాదు.. మీకు దమ్ముంటే చైనాలో సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి’ అంటూ బీజేపీకి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం సవాల్ విసిరారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలో ఓవైసీ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా 2020లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఓవైసీ మరోమారు ప్రస్తావించారు. హైదరాబాద్ లో రోహింగ్యాలు, పాకిస్థానీలు, ఆఫ్ఘనిస్థాన్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి ఓటు హక్కు కలిపించి, వారి ఓట్లతో ఎంఐఎం గెలవాలని ప్రయత్నిస్తోందని సంజయ్ ఆరోపించారు.
తాము గెలిచిన వెంటనే పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఓవైసీ తాజాగా మరోమారు కౌంటర్ ఇచ్చారు. పాతబస్తీలో కాదు.. చైనాలో సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని సవాల్ చేశారు. అదేవిధంగా, ఈ ఏడాది ఏప్రిల్ 23న చేవెళ్లలో జరిగిన బీజేపీ సంకల్ప్ సభలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ లీడర్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలనూ ఓవైసీ గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వ స్టీరింగ్ ఎంఐఎం చీఫ్ చేతుల్లో ఉందంటూ అమిత్ షా అప్పట్లో వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ స్టీరింగ్ నా చేతుల్లో ఉంటే మీకేం నొప్పి?’ అని ఓవైసీ ప్రశ్నించారు. ఆలయాల నిర్మాణానికి, పునర్నిర్మాణానికి కోట్లాది రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తూనే ఉందని, ఇక స్టీరింగ్ తన చేతుల్లో ఉంటే నొప్పి ఎందుకని ఓవైసీ నిలదీశారు.