mohith sharma: ఆ రాత్రి నిద్ర పట్టలేదు: గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ
- ఆలోచనలు చుట్టుముట్టాయన్న మోహిత్ శర్మ
- ఆ బాల్ అలా వేసి ఉంటే బాగుండేదన్న భావన
- లోపాలను అధిగమించి ముందుకు సాగిపోవాల్సిందేనని వెల్లడి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలు కావడంతో ఆ జట్టు బౌలర్ మోహిత్ శర్మకు నిద్ర కరవైంది. ఫైనల్ మ్యాచ్ లో చివరి ఓవర్, చివరి బంతికి చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడం తెలిసిందే. చివరి ఓవర్ లో 13 పరుగులు చేస్తేనే చెన్నైకి విజయం దక్కుతుంది. మోహిత్ శర్మపై నమ్మకం ఉంచిన గుజరాత్ టైటాన్స్ సారథి హార్థిక్ ప్యాండా అతడికి చివరి ఓవర్ వేసే అవకాశం ఇచ్చాడు. కానీ, చెన్నై విజయ దాహానికి మోహిత్ శర్మ అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యాడు.
దీనిపై మోహిత్ శర్మ తన అంతరంగాన్ని మీడియాతో పంచుకున్నాడు. ‘‘నాకు నిద్ర పట్టలేదు. గెలుపు కోసం భిన్నంగా ఏమి చేయగలననే ఆలోచన నన్ను వేధించింది. ఆ బాల్ ను అలా వేసి ఉంటే, ఈ బాల్ ను ఇలా వేసి ఉంటే ఎలా ఉండేదని అనిపించింది. అదేమీ మంచి ఫీలింగ్ కాదు. ఎక్కడో ఏదో లోపించింది. దాన్ని అధిగమించి ముందుకు సాగిపోవాల్సిందే’’ అని మోహిత్ శర్మ వివరించాడు.
‘‘నేను ఏమి చేయాలనే విషయమై నా మనసు చాలా స్పష్టతతో ఉంది. అలాంటి సందర్భాలపై నేను సాధన కూడా చేశాను. అలాంటి పరిస్థితులను గతంలోనూ ఎదుర్కొన్నాను. అందుకే యార్కర్లు వేయాలన్నది నా ఉద్దేశ్యం. ఐపీఎల్ అంతటా నేను అలానే చేశాను. నేను నా వంతు మెరుగ్గా ప్రయత్నించాను’’ అని మోహిత్ చెప్పాడు.