Rs 2000 note: రూ.17 వేల కోట్ల విలువైన 2 వేల నోట్లు వచ్చాయి: ఎస్బీఐ
- ఆర్బీఐ నిర్ణయంతో రూ.2 వేల నోట్లు మార్చుకుంటున్న జనం
- డిపాజిట్ చేసేందుకే మొగ్గు చూపుతున్న ఖాతాదారులు
- బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ లక్ష కోట్లు దాటుతుందన్న ఎస్బీఐ రీసెర్చ్ వింగ్
రూ.2 వేల నోటును చలామణిలో నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 19న ప్రకటన విడుదల చేసిన ఆర్బీఐ.. 24వ తేదీ నుంచి నోట్ల మార్పిడికి అవకాశం కల్పించింది. దీంతో జనం తమ దగ్గర ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో మార్చుకుంటున్నారు. ఇందులో ఎక్కువ శాతం మంది బ్యాంకు ఖాతాదారులు రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేయడానికే మొగ్గు చూపుతున్నారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆర్బీఐ నిర్ణయంతో ఈ వారం రోజుల్లో రూ.17 వేల కోట్ల విలువైన పెద్ద నోట్లు ఎస్బీఐకి వచ్చాయని పేర్కొంది.
ఇందులో సుమారు రూ.14 వేల కోట్ల విలువైన నోట్లను ఖాతాదారులు డిపాజిట్ చేయగా.. మిగతా రూ.3 వేల కోట్ల విలువైన నోట్లను మార్చుకున్నారని వివరించింది. నోట్ల మార్పిడి, డిపాజిట్ కు సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉండడంతో బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతాయని బ్యాంకు రీసెర్చ్ వింగ్ అంచనా వేసింది. దాదాపు 80 శాతం ఖాతాదారులు రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేస్తుండడంతో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్ ల పరంగా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ లక్ష కోట్లకంటే గణనీయంగా పెరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ వింగ్ పేర్కొంది.