Pakistan: పాకిస్థాన్‌కు మలేషియా షాక్.. బకాయిలు చెల్లించలేదని విమానం సీజ్
- కౌలాలంపూర్ లో విమానాన్ని సీజ్ చేసిన అధికారులు
- ఎయిర్ క్యాప్ అనే లీజింగ్ సంస్థకు పెద్ద మొత్తంలో బకాయిపడిన పాక్
- మలేషియా కోర్టు ఆదేశాలతో విమానం సీజ్ చేసినట్లు తెలిపిన పీఐఏ
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ కు మలేషియా షాకిచ్చింది! చెల్లింపులు జరపకపోవడంతో పాక్ జాతీయ విమానయాన సంస్థకు చెందిన విమానాన్ని మలేషియా సీజ్ చేసింది. కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) బోయింగ్ 777 విమానాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను అక్కడే వదిలేసినట్లు ARY న్యూస్ మంగళవారం నివేదించింది. ఎయిర్ క్యాప్ అనే లీజింగ్ సంస్థకు పాక్ పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించవలసి ఉంది.
మలేషియా కోర్టు ఆదేశాలు
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) మలేషియా నుంచి బోయింగ్ 777 విమానాన్ని లీజుకు తీసుకుంది. 4 మిలియన్ డాలర్ల బకాయిలు చెల్లించని కారణంగా కౌలాలంపూర్ విమానాశ్రయంలో BMH రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్న విమానాన్ని నిలిపివేశారు. ఇలాంటి అనుభవం ఎదురు కావడం ఇది రెండోసారి.
లీజర్ అభ్యర్థన మేరకు విమానాన్ని సీజ్ చేయాలని మలేషియా కోర్టు ఆదేశించడంతో కంపెనీ పాక్ విమానాన్ని సీజ్ చేసినట్లు పీఐఏ ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్ ఖాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని విమానయాన సంస్థ విమానాన్ని విడిపించేందుకు న్యాయపరమైన పరిష్కారాలను కోరుకుంటున్నామని, ఇప్పటికే చెల్లింపులు జరిపినట్లు చెప్పారు. బకాయిల కోసం పాకిస్థాన్ విమానాన్ని సీజ్ చేయడం గత రెండేళ్లలో ఇది రెండోసారి. 2021లో కౌలాలంపూర్ విమానాశ్రయ అధికారులు ఇదే విమానాన్ని సీజ్ చేశారు. అప్పుడు బకాయిల చెల్లింపు గురించి దౌత్యపరమైన హామీతో విమానాన్ని విడుదల చేశారు.