Delhi Police: బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవంటూ ఢిల్లీ పోలీసుల ట్వీట్.. ఆపై డిలీట్!

Wrestling Body Chiefs Dare As Delhi Police Deletes

  • బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్ చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు లభించలేదని తొలుత ట్వీట్
  • ఆయనపై నమోదైన పోక్సో కేసులో ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే అవకాశం ఉందని ట్వీట్
  • విమర్శలతో వెనక్కి తగ్గిన పోలీసులు
  • ట్వీట్ డిలీట్ చేసి మరో ట్వీట్

రెజ్లర్లను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై ఢిల్లీ పోలీసుల తీరు చర్చనీయాంశమైంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదంటూ ట్వీట్ చేసిన ఢిల్లీ పోలీసులు ఆ వెంటనే దానిని డిలీట్ చేయడంపై నెటిజన్లు ఎండగడుతున్నారు. 

రెజ్లర్ల ఆరోపణలను బలపరిచే సాక్ష్యాధారాలేవీ తమకు లభించలేదని, అందుకే ఆయనను అరెస్ట్ చేయలేదని పేర్కొన్న పోలీసులు.. బ్రిజ్‌భూషణ్‌పై నమోదైన పోక్సో కేసులో ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే అవకాశం ఉంటుందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. సాక్ష్యాధారాలను ఆయన ప్రభావితం చేయలేదని, కాబట్టే దర్యాప్తు అధికారి బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్ చేయలేదని పేర్కొంటూ పోలీసులు ట్వీట్ చేశారు. అంతేకాదు, మరో 15 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయడం కానీ, దర్యాప్తు వివరాలను నివేదిక రూపంలో న్యాయమూర్తికి సమర్పించడం కానీ చేస్తామని పేర్కొన్నారు. 

పోలీసులు చేసిన ఈ ట్వీట్ సర్వత్ర చర్చనీయాంశమైంది. పోలీసుల తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి మరో ట్వీట్ చేశారు. రెజ్లర్ల ఆరోపణలకు సంబంధించి కోర్టుకు పోలీసులు తుది నివేదిక సమర్పిస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని, కేసు విచారణ దశలో ఉందని పేర్కొన్నారు. దర్యాప్తు  పూర్తయ్యాకే నివేదిక సమర్పిస్తామని ఆ ట్వీట్‌లో తెలిపారు.

  • Loading...

More Telugu News