Mohan Babu: కాంట్రవర్సీ జోలికి ఎందుకు వెళ్లడం?.. రజనీకాంత్ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించిన మోహన్ బాబు
- రజనీకాంత్ వ్యవహారంపై మాట్లాడాలంటే సాయంత్రమైనా సమయం సరిపోదన్న మోహన్ బాబు
- దాని వల్ల లాభమేంటని, తాను ఎలాంటి వివాదాల జోలికి వెళ్లబోనని వ్యాఖ్య
- త్వరలో రూ.100 కోట్ల వ్యయంతో సినిమా నిర్మిస్తున్నానని వెల్లడి
ఇటీవల ఏపీలో సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహారంలో జరిగిన వివాదంపై స్పందించేందుకు సినీ నటుడు మంచు మోహన్ బాబు నిరాకరించారు. తన మిత్రుడు రజనీకాంత్ వ్యవహరంపై మాట్లాడాలంటే సాయంత్రమైనా సమయం సరిపోదని చెప్పారు. తాను ఇప్పుడు ఎలాంటి వివాదాల జోలికి వెళ్లబోనన్నారు. ‘‘సాయంత్రం వరకు చెప్పొచ్చు. దాని వల్ల లాభమేంటి? కాంట్రవర్సీ జోలికి ఎందుకు వెళ్లడం?’’ అని ప్రశ్నించారు.
గురువారం ఈ మేరకు తిరుమల శ్రీవారిని మోహన్ బాబు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో మోహన్ బాబు పాల్గొన్నారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత ఆయనకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు.
తర్వాత ఆలయం బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది తొలిసారిగా శ్రీనివాసుడి దర్శనం అద్భుతంగా జరిగిందని చెప్పారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయం వచ్చిందని, దేశంలోనే నంబర్ వన్ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. త్వరలో రూ.100 కోట్ల వ్యయంతో సినిమా నిర్మిస్తున్నానని మోహన్ బాబు తెలిపారు. చిత్రం వివరాలని త్వరలోనే తన కొడుకు విష్ణు వెల్లడిస్తారని చెప్పారు.
ఇదిలావుంచితే, ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల అంకురార్పణ సభ గత నెలలో విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. అయితే ఇందులో రజనీకాంత్ చేసిన ప్రసంగంపై వైసీపీ మంత్రులు, నేతలు తీవ్రంగా విమర్శించారు.