YS Bhaskar Reddy: బెయిల్ కోసం సీబీఐ కోర్టును ఆశ్రయించిన అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి
- 2019లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య
- దర్యాప్తు చేస్తున్న సీబీఐ
- గత ఏప్రిల్ నెలలో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్
- ఇటీవలే అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో బెయిల్
- తాజాగా సీబీఐ కోర్టులో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం తెలిసిందే. ఏప్రిల్ 16వ తేదీ నుంచి భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఉన్నారు. తాజాగా ఆయన బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెండ్రోజుల కిందట అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలో, భాస్కర్ రెడ్డి నేడు సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తన ప్రమేయం లేదని భాస్కర్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే నెల రోజులకు పైగా జైల్లో ఉన్నానని, తన ఆరోగ్య పరిస్థితి కూడా బాగా లేదని భాస్కర్ రెడ్డి తన పిటిషన్ లో వివరించారు. ఈ పిటిషన్ పై సీబీఐ న్యాయస్థానంలో విచారణ జరగాల్సి ఉంది.