NCERT: టెన్త్ క్లాస్ పాఠ్య పుస్తకాల నుంచి కొన్ని అధ్యాయాలను తొలగించిన ఎన్ సీఈఆర్టీ
- పదో తరగతి సిలబస్ పై ఎన్ సీఈఆర్టీ సమీక్ష
- విద్యార్థులపై భారం పడకుండా చర్యలు
- వివిధ సబ్జెక్టుల నుంచి పాఠ్యాంశాల తొలగింపు
జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్ సీఈఆర్టీ) పదో తరగతి సిలబస్ పై సమీక్ష నిర్వహించింది. టెన్త్ క్లాస్ పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని అధ్యాయాలు తొలగించినట్టు వెల్లడించింది. రసాయన మూలకాల ఆవర్తన పట్టిక, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యానికి సవాళ్లు అనే అధ్యాయాలను పదో తరగతి టెక్ట్స్ పుస్తకాల నుంచి తొలగించినట్టు ఎన్ సీఈఆర్టీ వివరించింది.
కొవిడ్ సృష్టించిన సంక్షోభం నేపథ్యంలో, విద్యార్థులపై భారాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్యాంశాలను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది.
సైన్స్ పుస్తకం నుంచి మూలకాల ఆవర్తన పట్టిక, ఇంధన వనరులు, సహజ వనరుల సుస్థిర నిర్వహణ అనే అధ్యాయాలను తొలగించారు. సాంఘిక శాస్త్రం నుంచి ప్రజాస్వామ్య రాజకీయాలు-1, ప్రముఖ పోరాటాలు ఉద్యమాలు, రాజకీయా పార్టీలు మరియు ప్రజాస్వామ్యానికి సవాళ్లు అనే అధ్యాయాలను తొలగించారు.
ఒకవేళ విద్యార్థులు 11, 12 తరగతుల్లో సంబంధిత సబ్జెక్టులు తీసుకోవాలని కోరుకుంటే, వారికి ఈ తొలగించిన అధ్యాయాలను 10వ తరగతిలో నేర్చుకునే వెసులుబాటు కల్పించారు. ఇటీవల పదో తరగతి సిలబస్ నుంచి జీవ పరిణామక్రమ సిద్ధాంతం పాఠ్యాంశాలను తొలగించాలని నిర్ణయించగా, విద్యా నిపుణుల నుంచి విమర్శలు వచ్చాయి.