Chandrababu: అది రాసింది ఎవడో కాని జగన్ చేతే బెస్ట్ అని చెప్పించాడు: చంద్రబాబు
- టీడీపీ మేనిఫెస్టో కాపీ అన్న సీఎం జగన్
- బిసిబేళా బాత్, పులిహోర వండేశారని వ్యాఖ్యలు
- ఆ రెండు కలిస్తే మంచిదే కదా అని చంద్రబాబు కౌంటర్
- బిసిబేళా బాత్ పౌష్టికాహారం అని, పులిహోర రుచిగా ఉంటుందని వెల్లడి
ఇటీవల టీడీపీ తీసుకువచ్చిన భవిష్యత్తుకు గ్యారంటీ మేనిఫెస్టోపై సీఎం జగన్ విమర్శలు చేయడంపై చంద్రబాబు స్పందించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు మేనిఫెస్టోను కాపీ కొట్టారని, కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ లను చూసి బిసిబేళా బాత్ వండేశారని, అది రుచిగా ఉంటుందో ఉండదో అన్న అనుమానంతో, ఏపీలో వైసీపీ పథకాలు కాపీ కొట్టేసి పులిహోర కూడా వండేశారని వ్యంగ్యం ప్రదర్శించారు.
జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఇవాళ్టి ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు. టీడీపీ ఒరిజినాలిటీకి, క్రియేటివిటీకి మారుపేరు అని స్పష్టం చేశారు. "సీఎం ఇంకో మాట కూడా అన్నాడు... ఈయన (చంద్రబాబు) రూ.2000 నోటు రద్దు చేయమన్నాడట... ఇలాంటి ఐడియాలు నాకెందుకు రావు అన్నాడు.
నీకెందుకు వస్తాయి అలాంటి ఆలోచనలు? ఆ రూ.2000 నోట్లు ప్రింట్ చేసి దొంగిలించడం నీకు అలవాటు. రూ.2 వేల నోటు రద్దు చేసి అవినీతిని నిర్మూలించాలన్నది టీడీపీ సిద్ధాంతం. అందుకే మాకు అలాంటి ఆలోచనలు వస్తాయి.
మేనిఫెస్టో రూపకల్పనలో మేం కర్ణాటకలో రెండు పార్టీలను చూశాం అంట. ఇక్కడో అందమైన పోలిక కూడా చెప్పాడు. బిసిబేళా బాత్, పులిహోర కలిపేశామన్నాడు. ఆ రెండు కలిస్తే మంచిదే కదా. బిసిబేళా బాత్ పౌష్టికాహారం, పులిహోర రుచిగా ఉంటుంది. మేం రూపొందించిన మేనిఫెస్టో బెస్ట్ అని తను చెప్పకనే చెప్పాడు. రాసింది ఎవడో కానీ... జగన్ తోనే బెస్ట్ అని చెప్పించాడు. రాసిన వాడికి కూడా ఆ విషయం తెలిసుండదు. తెలిస్తే మాత్రం, నువ్వెలా రాసిచ్చావురా ఇది అని వాడ్ని లేపేస్తాడేమో! జగన్ ఏమన్నాడో మీడియా వాళ్లు కూడా ఓసారి చూడండి... బ్యూటిఫుల్ మేనిఫెస్టో ఇచ్చామని ఒప్పుకున్నాడు... అదీ సంగతి" అని చంద్రబాబు వివరించారు.
అంతకుముందు కూడా చంద్రబాబు పలు సెటైర్లు వేశారు. "తెలుగు ఎక్కడ చదుకువుకుని వచ్చాడో ఎవరికైనా చెప్పాడా? గొప్ప వ్యక్తి కదా. గొప్ప మేధావి. ఆయన ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలో చదివాడు. ఆ యూనివర్సిటీ పేరేమిటో ఎవరికీ తెలియదు. ఆయన గొప్ప ఆర్థికవేత్త, గొప్ప సంఘ సంస్కర్త. ఆ సంఘ సంస్కర్త బాధ్యత బాబాయ్ ని గొడ్డలితో లేపేయడం. వీళ్లు ఉపన్యాసాలు చెబుతుంటారు" అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.