Telangana: 5 లక్షల కోట్ల అప్పు, 22 లక్షల కోట్ల ఖర్చు.. అయినా ప్రజల జీవితం మారలేదు: రేవంత్

TPCC Chief Revanth reddy questions CM KCR over state development
  • తొమ్మిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారన్న టీపీసీసీ చీఫ్
  • న్యూజెర్సీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రేవంత్
  • రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎన్ఆర్ఐలకు పిలుపు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ఈ తొమ్మిదేళ్లలో రూ.17 లక్షల కోట్లు బడ్జెట్ ద్వారా వచ్చాయని, అప్పుతో కలిపి మొత్తం రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణ ప్రజల సగటు జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదని విమర్శించారు. న్యూజెర్సీలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ ప్రవాసులకు పిలుపునిచ్చారు. 

అమెరికాలో ఉన్న తెలంగాణ వాళ్లు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కాంగ్రెస్ విజయంతోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్న రేవంత్ కేసీఆర్ దోపిడీని ఇంకా ఎంతకాలం భరిద్దాం? అని ప్రశ్నించారు. అన్ని వర్గాల పోరాటం, త్యాగంతో రాష్ట్రం ఏర్పాటైతే, ఒక్క కేసీఆర్ కుటుంబమే పదేళ్లుగా పాలిస్తూ అడ్డగోలుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని రేవంత్ దుయ్యబట్టారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కూడా తెలంగాణ ప్రజలు ఆదరించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలు ఆశలు, ఆశయాలు నెరవేరుతాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Telangana
KCR
Revanth Reddy
TPCC President

More Telugu News