Sajjala Ramakrishna Reddy: టీడీపీ మేనిఫెస్టోను జగన్ పొగిడారని చంద్రబాబు తనకు తానే అనుకోవడం వింతగా ఉంది: సజ్జల
- చంద్రబాబు మాటలు పగటికలల్లా ఉంటాయన్న సజ్జల
- బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు పాకులాడుతున్నాడని ఎద్దేవా
- పవన్ యాత్రపై తమకేమీ అభ్యంతరం లేదని వ్యాఖ్యలు
- లోకేశ్ ది చిల్లర వ్యవహారం అని విమర్శలు
ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడే అయినా, టీడీపీ మేనిఫెస్టోను జగన్ పొగిడారని తనకు తానే చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు మాటలు పగటి కలలకు ఏమాత్రం తీసిపోవని ఎద్దేవా చేశారు.
బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు పాకులాడుతున్నారని, అందుకే ఢిల్లీ వెళుతున్నారని విమర్శించారు. జగన్ ఢిల్లీ వెళితే రచ్చ చేసేవాళ్లు చంద్రబాబు గురించి ఏం మాట్లాడతారని సజ్జల ప్రశ్నించారు.
ఇక, పవన్ కల్యాణ్ యాత్రపై తమకే అభ్యంతరం లేదని, తాము కూడా ప్రజల్లో తిరగమనే చెబుతున్నామని అన్నారు. అయితే పవన్ ఎంతవరకు తిరుగుతాడన్నది నమ్మకం లేదని, గతంలో తన కుమారుడి కోసం పవన్ యాత్రను చంద్రబాబు ఆపినట్టు తెలుస్తోందని సజ్జల వ్యాఖ్యానించారు. ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రావాలనుకుంటే ప్రజలు ఆమోదించరని స్పష్టం చేశారు.
లోకేశ్ వ్యవహారంపైనా సజ్జల స్పందించారు. పాదయాత్రలో ఎంతో చవకబారుగా వివేకా అంశంపై ప్లకార్డులు ప్రదర్శిస్తున్నాడని, లోకేశ్ ది చిల్లర వ్యవహారం అని విమర్శించారు. లోకేశ్ కు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మానసిక వైకల్యం ఏర్పడి ఉండొచ్చని వ్యంగ్యం ప్రదర్శించారు. ఏపీలో చంద్రబాబు, పవన్, లోకేశ్ అంతా అతిథి పాత్రల నటులేనని అభివర్ణించారు.