rahul ramakrishna: రైలు ప్రమాదం సమయంలో ఈ వీడియోలా?.. కమెడియన్‌పై నెటిజన్ల ఫైర్
- సైలెంట్ అనే హాలీవుడ్ సినిమాలోని రైలు విన్యాసాలు షేర్ చేసిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ
- ఒడిశా రైలు ప్రమాదం సమయంలో విన్యాసాల వీడియో షేర్ చేయడంపై నెటిజన్ల ఆగ్రహం
- వీడియోలు తొలగించి, క్షమాపణలు చెప్పిన కమెడియన్
ఒడిశాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 300 మంది వరకు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ప్రధాని మోదీ నుండి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్లు విమర్శలకు తావిచ్చాయి. ఇందుకు కారణం అతను రైలు ఎదుట విన్యాసాలను పోస్ట్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వీడియోలు ట్వీట్ చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సైలెంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటుడు బస్టర్ కీటన్ రైలు ముందు చేసే విన్యాసానికి సంబంధించిన వీడియోలను షేర్ చేశాడు. ఓ వైపు వందల సంఖ్యలో మరణిస్తే, వేలాది కుటుంబాలు కన్నీటి సముద్రంలో మునిగిపోయిన సమయంలో ఇలాంటి విన్యాసాలు షేర్ చేయడం ఏమిటని నెటిజన్లు ఏకిపారేశారు. తన తప్పు తెలుసుకున్న రాహుల్ రామకృష్ణ వాటిని తొలగించాడు. అంతేకాదు, క్షమాపణ కూడా చెప్పాడు.
తాను చేసిన ట్వీట్ కు సారీ చెబుతున్నానని, ప్రామిస్.. తనకు ఒడిశా రైలు ప్రమాదం గురించి తెలియదని చెప్పాడు. తాను అర్ధరాత్రి నుండి స్క్రిప్ట్ రాసుకునే పనిలో ఉన్నానని చెప్పాడు. తాను వార్తలు చూడలేదని, అందుకే ఈ తప్పు జరిగిందని, మరోసారి క్షమాపణ కోరుతున్నానని చెప్పాడు. ఆయన సారీ చెప్పడంతో నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందించారు.