Uttar Pradesh: వరుడికి ‘రంగు’ పడింది.. కలర్ తక్కువగా ఉన్నాడని పీటలపై పెళ్లికి నిరాకరించిన యువతి!
- ఉత్తరప్రదేశ్లోని కౌశాంబిలో ఘటన
- ఊరేగింపుగా కల్యాణ మండపానికి చేరుకున్న వరుడు
- వరుడు రంగు తక్కువగా ఉన్నాడని మాల వేసేందుకు వధువు నిరాకరణ
- ఇరు కుటుంబాల వారు నచ్చజెప్పే ప్రయత్నం
- వధువు పట్టు వీడకపోవడంతో వెనుదిరిగిన వరుడి కుటుంబం
అంతా సవ్యంగా జరిగితే మరికొన్ని క్షణాల్లో ఆమె మెడలో అతడు తాళికట్టేవాడే. కానీ, కథ అడ్డం తిరిగింది. వరుడి మెడలో వేసేందుకు పూలదండతో మండపంపైకి వచ్చిన వధువు అతడి శరీర రంగును పరిశీలించి దండ వేయడానికి నిరాకరించింది. పెళ్లి చేసుకోనని మొండికేసింది. దీంతో ఇరు కుటుంబాలతోపాటు పెళ్లికొచ్చిన అతిథులు కూడా అవాక్కయ్యారు. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పిపరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్పురాకు చెందిన యువకుడికి, చర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. గత నెల 29న వివాహం జరగాల్సి ఉండగా వరుడు ఊరేగింపుగా మండపానికి చేరుకున్నాడు.
మండపానికి చేరుకున్న వరుడి మెడలో మాల వేసేందుకు వచ్చిన వధువు.. అతడి శరీర రంగు తనకు నచ్చలేదని చెబుతూ మాల వేసేందుకు నిరాకరించింది. తనకంటే రంగు తక్కువగా ఉన్నాడని, వయసు కూడా పెద్దగా కనిపిస్తోందని చెప్పడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పడంతో అందరూ షాకయ్యారు. ఇరు కుటుంబాల వారు ఆమెకు నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో వరుడి తరపు వారు అక్కడి నుంచి వెనుదిరిగారు.