Odisha: ఒడిశా రైలు ప్రమాదం: పేరెంట్స్‌తో డిన్నర్ ప్లాన్ 16 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడింది!
- కోరమాండల్ లో వేర్వేరు బోగీల్లో తల్లిదండ్రులు, తనయుడు
- తండ్రి ఫుడ్ ఆర్డర్ చేయడంతో ప్రమాదానికి క్షణాల ముందు బోగీ మారిన కొడుకు
- బీ8 నుండి బీ2కు రావడంతో తప్పిన ప్రమాదం
ఒడిశాలోని బాలాసోర్ బహనాగా బజార్ స్టేషన్‌లో జరిగిన ట్రిపుల్ ట్రైన్ ప్రమాదంలో వందలాది మంది మృతి చెందారు. అయితే, తల్లిదండ్రులతో ఢిన్నర్ ప్లాన్ కారణంగా ఈ ప్రమాదం నుండి 16 ఏళ్ల బాలుడు బతికి బయటపడ్డాడు. బర్హంపూర్ కు చెందిన ఎజికల్ దాస్ తన భార్య సుమితా దాస్, కొడుకు జార్జ్ జాకబ్ దాస్‌తో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. B2 కోచ్‌లో తల్లిదండ్రులు ఉండగా, జాకబ్‌కు B8 కోచ్‌లో సీటు కన్ఫర్మ్ అయ్యింది. బాలాసోర్ స్టేషన్‌కు రావడానికి ముందు తన కుమారుడు జార్జ్‌ను డిన్నర్ కోసం రావాలని తండ్రి ఫోన్ చేశాడు. ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు B8 కోచ్ నుంచి B2 కోచ్‌కు వెళ్లాడు. అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో B2 కోచ్‌కు ఏమీ కాలేదు. దీంతో ఈ పదహారేళ్ల బాలుడు బతికిపోయాడు. ప్రమాదంలో B8 కోచ్ తీవ్రంగా దెబ్బతింది.
తాను కటక్ స్టేషన్ వద్ద రాత్రి ఏడు గంటల సమయంలో ఫుడ్ ఆర్డర్ చేశానని, దీంతో తన కొడుకు తమ వద్దకు వచ్చాడని, రాత్రి ఏడు గంటల 5 నిమిషాల నుండి ఏడు గంటల 10 నిమిషాల మధ్య భారీ శబ్దాలు వినిపించాయని, పది క్షణాల్లోనే అంతా జరిగిపోయిందని చెప్పాడు జాకబ్. రైలు ఆగిన తర్వాత తాము దిగి చూస్తే కోచ్ లు అన్నీ పడిపోయి ఉన్నాయన్నాడు.