Bopparaju: ప్రభుత్వం మా డిమాండ్లు చాలావరకు నెరవేర్చింది: బొప్పరాజు
- మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ
- మీడియాతో మాట్లాడిన ఉద్యోగ సంఘాల నేతలు
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపై సానుకూల స్పందన వచ్చిందన్న బొప్పరాజు
- మెరుగైన పెన్షన్ విధానం అమలు చేస్తామని చెప్పారన్న వెంకట్రామిరెడ్డి
ఏపీ మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం ముగిసింది. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని మంత్రుల కమిటీకి స్పష్టంగా చెప్పామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందని వెల్లడించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం చాలావరకు నెరవేర్చిందని, ఉద్యమం కొనసాగింపుపై ఈ నెల 8న నిర్ణయం తీసుకుంటామని బొప్పరాజు పేర్కొన్నారు.
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, మంత్రుల నోట జీపీఎస్ అనే పదమే రాలేదని అన్నారు. మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారని వెల్లడించారు. కాగా, 12వ పీఆర్సీ చైర్మన్ గా ఎవరి పేరు ప్రతిపాదనకు రాలేదని తెలిపారు.