Jharkhand: లోకో పైలట్ అప్రమత్తత.. తృటిలో తప్పిన రైలు ప్రమాదం
- ఝార్ఖండ్‌లో వెలుగు చూసిన ఘటన
- సంతాల్‌ధీ రైల్వే క్రాసింగ్ వద్ద గేటును ఢీకొట్టిన ట్రాక్టర్
- అదే మార్గంలో వస్తున్న ఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్
- ట్రాక్టర్‌ను చూసిన వెంటనే బ్రేకులు వేసి రైలును ఆపేసిన లోకోపైలట్
- ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ట్రాక్టర్ డ్రైవర్
లోకోపైలట్ అప్రమత్తతతో మరో రైలు ప్రమాదం తృటిలో తప్పిపోయింది. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు పడుతున్న సమయంలో ఓ ట్రాక్టర్ దాన్ని ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన లోకోపైలట్ రైలు బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఝార్ఖండ్‌లో సంతాల్‌ధీ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
రైల్వే గేటును ట్రాక్టర్ ఢీకొనడాన్ని గమనించిన ఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ వెంటనే బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు 45 నిమిషాలు పాటు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ట్రాక్టర్‌ను జప్తు చేసి కేసు నమోదు చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.