Wrestlers: రెజ్లర్లను చర్చలకు పిలిచిన కేంద్ర ప్రభుత్వం
- అమిత్ షాతో ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసిన రెజ్లర్ల చర్చలు
- మరోసారి చర్చలకు రావాలన్న కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్
- బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఏడుగురు మహిళా రెజ్లర్లు
ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు పోరాడుతున్న సంగతి తెలిసిందే. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రెజ్లర్లతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జరిపిన చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ముగిశాయి. ఈ నేపథ్యంలో, రెజ్లర్లతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. చర్చలకు రావాల్సిందిగా రెజ్లర్లను మరోసారి తాను ఆహ్వానిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు ఒలింపిక్స్ లో భారత్ కు మెడల్ తీసుకొచ్చిన రెజ్లర్ భజరంగ్ పూనియా మాట్లాడుతూ కేంద్రంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని అన్నారు. తమ నిరసన కార్యక్రమం ఇంతటితో ఆగిపోలేదని, తమ కార్యాచరణను ముందుకు ఎలా తీసుకెళ్లాలనే వ్యూహంపై ఆలోచిస్తున్నామని తెలిపారు.
ఇంకోవైపు, ఏడుగురు మహిళా రెజ్లర్లు (వీరిలో ఒకరు మైనర్) బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయనపై పారదర్శకంగా విచారణ జరిపి, కఠినంగా శిక్షించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.