BCs: బీసీలకు తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం.. అర్హతలు, నిబంధనలు ఇవే!
- వెనుకబడిన కులాలకు, చేతివృత్తిదారులకు ఆర్థికసాయం
- ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ
- పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే ఆర్థికసాయం
వెనుకబడిన కులాలకు, చేతివృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. అర్హులైన వారికి రూ. లక్ష ఆర్థికసాయం అందించబోతోంది. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నిన్నటి నుంచే ప్రారంభమయింది. ఈ నెల 20 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తుల స్వీకరణ కోసం https://tsobmmsbc.cgg.gov.in వెబ్ సైట్ ను ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. లబ్ధిదారుల వృత్తి పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు ఈ నిధులు ఉపయోగపడతాయని మంత్రి గంగుల తెలిపారు.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి మార్గదర్శకాలు:
- లబ్ధిదారులు బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులై ఉండాలి.
- వయసు జూన్ 2 నాటికి 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
- వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలకు మించి ఉండకూడదు.
- పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే నిధులు అందిస్తారు.
- కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పథకం వర్తిస్తుంది.
- గత 5 ఏళ్లలో ఏ ప్రభుత్వ శాఖ ద్వారా ఆర్థిక సాయం పొంది ఉండకూడదు.
- 2017-18లో రూ. 50 వేల ఆర్థికసాయం పొందినవారు కూడా అనర్హులు.
- వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను సమర్పించాలి.
- మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి దరఖాస్తుదారుల వివరాలను పరిశీలిస్తారు.
- ఎంపికైన లబ్ధిదారులను ఆన్ లైన్ లో ప్రకటిస్తారు.
- ఎంపికైన వారి బ్యాంకు ఖాతాకు నేరుగా ఆర్థికసాయాన్ని జమ చేస్తారు. ఆర్థికసాయం పొందిన నెలలోగా పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.