Southwest Monsoon: ఇదిగో అదిగో అంటున్న నైరుతి రుతుపవనాలు

Uncertainity on Southwest monsoon onset

  • బాగా ఆలస్యం అయిన నైరుతి రుతుపవనాలు
  • జూన్ 1నే కేరళను తాకాల్సిన రుతుపవనాలు
  • మొదట 4 రోజులు ఆలస్యం అని ప్రకటించిన ఐఎండీ
  • ఇప్పటివరకు జాడలేని వైనం
  • అరేబియా సముద్రంలో బిపార్ జోయ్ తుపాను

భారతదేశంలో జూన్ 1న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉండగా, ఇప్పటివరకు వాటి జాడే లేదు. భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఈసారి నైరుతి రుతువపనాలు 4 రోజులు ఆలస్యం అని ప్రకటించినా, జూన్ 7వ తారీఖు వచ్చినా వాటి కదలికపై స్పష్టత లేదు. ఇప్పటివరకు రుతుపవనాలు కేరళ తీరాన్నే తాకకపోవడంతో, దేశంలోని మిగతా భాగాలపై రుతుపవనాల విస్తరణకు మరి కొన్నిరోజులు పట్టేట్టుంది. 

నైరుతి సీజన్ కు సంబంధించి ఐఎండీ ఇటీవల వెల్లడించిన నివేదికలన్నీ తారుమారయ్యాయి. రుతుపవనాలు ఆలస్యమైన నేపథ్యంలో, 96 శాతం వర్షపాతం అంచనా అయినా నిజమవుతుందో, లేదో చూడాలి. ఎందుకంటే, గతంలో రుతుపవనాలు ఆలస్యం అయిన ప్రతిసారి వర్షపాతం తక్కువగా నమోదైంది. 

ప్రస్తుతం అరేబియా సముద్రంలో బిపార్ జోయ్ తీవ్ర తుపాను కొనసాగుతోంది. దీని కారణంగానే రుతుపవనాల కదలికలు ప్రభావితమైనట్టు వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఇది మరికొన్ని గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుంది. ఇది బలహీనపడితేనే నైరుతి రుతుపవనాలు భారత భూభాగంపైకి ప్రవేశిస్తాయని తెలుస్తోంది. రాగల 3 రోజుల్లో ఇది ఉత్తర వాయవ్య దిశగా వెళ్లిపోనుంది.

ఈ నేపథ్యంలో, ఐఎండీ తాజా ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాల రాకకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని, రాగల 48 గంటల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వివరించింది.

  • Loading...

More Telugu News