Rs 500 notes: రూ.500 నోటునూ వెనక్కి తీసుకుంటారా? అన్న ప్రశ్నకు గవర్నర్ దాస్ రియాక్షన్ ఇదిగో!
- రూ.500 నోట్లను వెనక్కి తీసుకునే ప్రతిపాదన లేదన్న ఆర్ బీఐ గవర్నర్
- రూ.1,000 నోటును ప్రవేశపెట్టాలని అనుకోవడం లేదని స్పష్టీకరణ
- దయచేసి వదంతులు వ్యాప్తి చేయవద్దని వినతి
నరేంద్ర మోదీ సర్కారు 2016లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి, ఆ వెంటనే రూ.500, రూ.2,000 కొత్త నోట్లను తీసుకొచ్చింది. పెద్ద నోట్ల రూపంలో నల్లధనం పేరుకుపోతుందని చెప్పి రద్దు చేసిన సర్కారు, రూ.2,000 నోటును తేవడం ఏంటనే విమర్శలు వచ్చాయి. రూ.2,000 నోటును కూడా తర్వాత రద్దు చేస్తారనే అంచనాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. వాటిని నిజం చేస్తూ రూ.2,000 నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ఇటీవలే ఆర్ బీఐ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వరకు బ్యాంకుల్లో మార్చుకునే అవకాశం కల్పించడం తెలిసిందే.
ఇక రూ.500 నోటును కూడా రద్దు చేయవచ్చనే అభిప్రాయాలు ఇప్పుడు తెగ వ్యాప్తిలోకి వస్తున్నాయి. ఇదే ప్రశ్నను ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ను మీడియా ప్రతినిధులు ఈ రోజు అడిగారు. ఆర్ బీఐ ఎంపీసీ నిర్ణయాలను ప్రకటించే సమావేశంలో ఇది చోటు చేసుకుంది. దీనికి గవర్నర్ శక్తికాంతదాస్ సూటిగా సమాధానం ఇచ్చారు. ‘‘ఆర్ బీఐ రూ.500 నోట్లను వెనక్కి తీసుకోవాలని అనుకోవడం లేదు. లేదా రూ.1,000 నోట్లను ప్రవేశపెట్టాలని కూడా అనుకోవడం లేదు. దయచేసి దీనిపై వదంతులు తీసుకురావద్దని ప్రజలను కోరుతున్నాను’’ అని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. అయితే, ఇప్పటికిప్పుడు ప్రతిపాదన లేని విషయాన్నే గవర్నర్ చెప్పగలరు కానీ, భవిష్యత్తులో ఇది జరగబోదని ఎవరూ చెప్పలేరన్నది గమనార్హం.
ఇక వ్యవస్థలో ఉన్న రూ.2,000 నోట్లలో సగం మేర ఇప్పటికే బ్యాంకుల్లోకి వచ్చాయని శక్తికాంతదాస్ తెలిపారు. వెనక్కి వచ్చిన రూ.2,000 నోట్ల విలువ రూ.1.80 లక్షల కోట్లు ఉంటుందన్నారు. అంటే మొత్తం మీద వ్యవస్థలో రూ.3.62 లక్షల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు ఉన్నాయి. వెనక్కి వచ్చిన రూ.1.80 లక్షల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లలో 85 శాతాన్ని ప్రజలు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోగా, మిగిలిన 15 శాతాన్ని బ్యాంకులకు వచ్చి మార్చుకుని తీసుకెళ్లినట్టు దాస్ చెప్పారు.