Team India: రెండో రోజు ఆటలో భారత బౌలర్ల వేట
- లండన్ లోని ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
- బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్
- 99 ఓవర్లలో 6 వికెట్లకు 387 రన్స్
- 163 పరుగులు చేసి అవుటైన ట్రావిస్ హెడ్
- 121 పరుగులు చేసిన స్మిత్
లండన్ లోని ఓవల్ మైదానంలో టీమిండియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్ కూడా సెంచరీ సాధించాడు. స్మిత్ 229 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. విదేశీ గడ్డపై స్మిత్ కు ఇది 7వ సెంచరీ.
కాగా, తొలి రోజు ఆటలో సెంచరీ నమోదు చేసిన ట్రావిస్ హెడ్ ఇవాళ రెండో రోజు ఆటలో 163 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరాన్ గ్రీన్ ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. కేవలం 6 పరుగులు చేసిన గ్రీన్... షమీ బౌలింగ్ లో స్లిప్స్ లో శుభ్ మాన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత స్మిత్ (121) ను శార్దూల్ ఠాకూర్ బౌల్డ్ చేయడంతో ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది.
ఇవాళ రెండో రోజు ఉదయం ఓవర్ నైట్ స్కోరు 327-3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ కొద్ది వ్యవధిలోనే హెడ్, గ్రీన్, స్మిత్ వికెట్లు కోల్పోయింది. తొలిరోజుతో పోల్చితే టీమిండియా బౌలర్లు రెండో రోజు ఆట తొలి సెషన్ లో ఎంతో మెరుగైన బౌలింగ్ చేశారు.
ప్రస్తుతం ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 99 ఓవర్లలో 6 వికెట్లకు 387 పరుగులు... కాగా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అలెక్స్ కేరీ 8 పరుగులతో, స్టార్క్ పరుగులేమీ లేకుండా క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 2, సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు.