Tirumala: తిరుమల గగనతలంలోకి మూడు విమానాల రాక
- గురువారం ఉదయం శ్రీవారి ఆలయ గగనతలంలోకి మూడు విమానాల రాక
- ఘటనపై ఆలయ భద్రత అధికారుల పరిశీలన
- తిరుమల గగనతలాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించాలంటూ పౌరవిమానయాన శాఖకు గతంలోనే టీటీడీ విజ్ఞప్తి
- టీటీడీ అభ్యర్థనలపై కానరాని పురోగతి
తిరుమల గగనతలంలో మళ్లీ విమానాలు సంచరించాయి. గురువారం ఉదయం 7.45, 8.00, 8.22 గంటలకు మూడు విమానాలు శ్రీవారి ఆలయ గగనతలం నుంచి వెళ్లాయి. దీంతో, టీటీడీ అధికారులు ఈ ఘటనపై దృష్టిసారించారు. శ్రీవారి ఆలయ గగనతలం నుంచి విమానాలు వెళ్లడం నెల రోజుల వ్యవధిలో ఇది మూడోసారి కావడంతో భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రాల ప్రకారం, తిరుమల ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం నిషిద్ధం.
విమానాల రాకకు అడ్డుకట్ట వేసేలా శ్రీవారి ఆలయ గగనతలాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించాలని పౌర విమానయాన శాఖకు టీటీడీ గతంలోనే విజ్ఞప్తి చేసింది. కానీ, ఈ దిశగా ఆశించిన పురోగతి మాత్రం లేదు. దీంతో, విమానాం వచ్చి వెళ్లిన ప్రతిసారీ టీటీడీ వర్గాలు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాల్సి వస్తోంది.