Uttar Kasi: ఉత్తర కాశీలో తీవ్రమైన మత ఉద్రిక్తతలు.. నగరాన్ని విడిచి వెళ్తున్న ముస్లింలు
- జూన్ 15 నాటికి ముస్లింలు వెళ్లిపోవాలని హిందూ సంఘం ఆదేశాలు
- ఒక్కసారిగా పెరిగిన ముస్లిం వలసలు
- నగరాన్ని వీడిన బీజేపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు
ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీని విడిచి ముస్లింలు వెళ్లిపోతున్నారు. మతపరమైన ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతుండటంతో భయాందోళనలతో ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఒక మైనర్ హిందూ బాలికను ఇద్దరు ముస్లిం వ్యక్తులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన తర్వాత అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముస్లింలపై హిందువులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. అంతేకాదు జూన్ 15 నాటికి ఉత్తరకాశీలోని ఇళ్లు, దుకాణాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఒక ప్రత్యేక హిందూ సంఘం ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా అక్కడి నుంచి వలసలు ప్రారంభమయ్యాయి.
బీజేపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ జాహిద్ కూడా తన కుటుంబంతో కలిసి నగరాన్ని విడిచిపోయారంటే అక్కడి పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత 25 ఏళ్లుగా జాహిద్ అక్కడే ఉంటున్నారు. తన షాపులో ఉన్న వస్తువులన్నీ తీసుకుని డెహ్రాడూన్ వెళ్లిపోయారు. ఆయనతో పాటు మరో 6 కుటుంబాలు కూడా షాపులు ఖాళీ చేసి వెళ్లిపోయాయి.