Team India: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 296 ఆలౌట్... ఇప్పటికీ కనిపిస్తున్న చాన్సులు!
- డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ × ఆస్ట్రేలియా
- ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 469 రన్స్
- ఆసీస్ కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
- బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిస్తే టీమిండియా గెలిచే అవకాశం!
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా ఆసీస్ కు 173 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సమర్పించుకుంది.
అయితే, ఈ మ్యాచ్ కు ఇంకా రెండున్నర రోజుల సమయం మిగిలున్నప్పటికీ, టీమిండియాకు కొన్ని అవకాశాలు లేకపోలేదు. బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచి ఆసీస్ ను రెండో ఇన్నింగ్స్ లో 150 పరుగుల లోపే కట్టడి చేస్తే... అప్పుడు భారత్ ముందు 330 పరుగుల కంటే తక్కువ లక్ష్యం నిలుస్తుంది. ప్రపంచంలోనే అగ్రశ్రేణి బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత టాపార్డర్ గట్టి పట్టుదలతో పోరాడితే ఇదేమంత పెద్ద లక్ష్యం కాబోదు.
కానీ అందుకు పరిస్థితులు కూడా అనుకూలించాలి. ఎందుకంటే, ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ఓవల్ మైదానంలో అత్యధిక చేజింగ్ 263 పరుగులు. అంతేకాదు, ఇక్కడ రెండో ఇన్నింగ్స్ సగటు స్కోరు 304 పరుగులు. ఏ లెక్కన చూసినా గణాంకాలు టీమిండియాకు అనుకూలంగా కనిపించడంలేదు.
ఇక, నేటి ఆట విషయానికొస్తే... ఓవర్ నైట్ స్కోరు 151-5తో ఈ ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ స్కోరు 250 మార్కు దాటిందంటే అందుకు రహానే, శార్దూల్ ఠాకూరే కారణం. ఈ జోడీ ఏడో వికెట్ కు 100కి పైగా పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించింది. రహానే 89 పరుగులు చేయగా, శార్దూల్ ఠాకూర్ 51 పరుగులు చేశాడు. వీరిద్దరూ అవుటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ ఎక్కువసేపు కొనసాగలేదు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ 3, స్టార్క్ 2, బోలాండ్ 2, కామెరాన్ గ్రీన్ 2, లైయన్ 1 వికెట్ తీశారు.