haridwar: ఉత్తరాఖండ్ లోని ఈ ఆలయాలకు మహిళలు షార్ట్స్‌తో వస్తే ప్రవేశం లేదంటున్న హిందూ ధర్మ సంస్థ!
- మహా నిర్వాణి అఖార హిందూ సంస్థ ప్రకటన
- తమ పరిధిలోని 3 దేవాలయాల్లోకి సంప్రదాయ దుస్తులతో రావాలని విజ్ఞప్తి
- నిబంధనలు పలు రాష్ట్రాల్లోని ఆలయాల్లో అమల్లో ఉన్నట్లు వెల్లడి
ఉత్తరాఖండ్ లోని తమ పరిధిలోని ఆలయాలకు మహిళలు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని, దీనిని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఇక్కడి మహా నిర్వాణి అఖార హిందూ సంస్థ హెచ్చరించింది. శరీరాన్ని ఎనభై శాతం కప్పి ఉంచే సంప్రదాయ దుస్తులతో వస్తేనే దైవ దర్శనానికి అనుమతి ఉంటుందని ఈ హిందూ ధర్మ సంస్థ సెక్రటరీ శ్రీ మహంత్ రవీంద్ర పూరి స్పష్టం చేశారు.
తమ పరిధిలోని హరిద్వార్ కంఖాల్ లోని దక్ష ప్రజాపతి ఆలయం, పవూరి జిల్లాలోని నీలకంఠ మహదేవ్, డెహ్రాడూన్ లోని టపకేశ్వర్ మహదేవ్... ఈ మూడు ఆలయాల్లోకి సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని పేర్కొన్నారు. ఈ దేవాలయాలు మహా నిర్వాణి అఖారా పరిధిలో ఉన్నాయి. ఈ గుళ్లలో మహిళలు షార్ట్స్, ఫ్యాషన్ దుస్తులు ధరించి రావొద్దని కోరారు. ఈ నిబంధనలు ఇప్పటికే మహారాష్ట్ర, భారత్ లోని దక్షిణ ప్రాంతంలోని ఆలయాల్లో అమల్లో ఉన్నట్లు చెప్పారు. ఆలయాలు ఉన్నవి ఆధ్యాత్మిక ఉన్నతి కోసమని, అంతే తప్ప వినోదం కోసం కాదని వ్యాఖ్యానించారు.