Devendra Fadnavis: ఏక్‌నాథ్ షిండేను ట్రాప్ చేయాలని చెప్పారుగా.. అమృత ఫడ్నవీస్‌తో క్రికెట్ బుకీ
- క్రికెట్ బుకీ అనిల్ జైసింఘానిపై పలు రాష్ట్రాల్లో కేసులు
- ఎత్తివేయించేందుకు రంగంలోకి దిగిన అతని కుమార్తె అనీక్ష
- కోటి రూపాయల లంచం ఇస్తానంటూ బేరం
- అంగీకరించకపోవడంతో బ్లాక్‌మెయిల్
- రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్‌ను ఓ క్రికెట్ బుకీ బ్లాక్‌మెయిల్ చేసిన ఘటనలో పోలీసులు తాజాగా చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ముంబైలోని మలబార్ హిల్స్ పోలీసులు కోర్టుకు సమర్పించిన 793 పేజీల చార్జ్‌షీట్‌లో ఈ కేసుకు సంబంధించి పలు విషయాలు పేర్కొన్నారు. క్రికెట్ బుకీ అనిల్ జైసింఘాని (56), ఆయన కుమార్తె అనీక్ష (23) తనను బ్లాక్‌మెయిల్ చేసినట్టు ఫిబ్రవరి 20న అమృత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తాజాగా ఈ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
అనిల్‌పై మహారాష్ట్ర, రాజస్థాన్, గోవా సహా పలు రాష్ట్రాల్లో కేసులున్నాయి. తండ్రిపై నమోదైన కేసులను ఎత్తివేయించే లక్ష్యంతో అమృత ఫడ్నవీస్‌ను అనీక్ష ఆశ్రయించింది. నవంబరు 2021లో అమృతను కలిసిన అనీక్ష తాను ఫ్యాషన్ డిజైనర్‌నంటూ పరిచయం చేసుకుంది. స్నేహం పెరిగిన తర్వాత తన తండ్రిపై ఉన్న కేసుల గురించి ప్రస్తావిస్తూ వాటిని ఎత్తివేయిస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ బేరం పెట్టింది. అందుకామె అంగీకరించకపోవడంతో నకిలీ వీడియోలు సృష్టించి రూ. 10 కోట్లు ఇవ్వాలంటూ తండ్రీకూతురు కలిసి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు.
వీడియోలను బయటపెట్టి పరువు తీస్తామని, ఏక్‌నాథ్ షిండేను ట్రాప్ చేయడం ద్వారా ఉద్ధవ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించాలని చెప్పింది నువ్వేకదా.. అంటూ అమృతకు వాట్సాప్ మెసేజ్‌లు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బెదిరించారు. ఈ క్రమంలో నిందితుల ఆచూకీని కనుగొనేందుకు పోలీసుల సలహాతో అమృత వారికి మెసేజ్‌లు పంపిస్తూ టచ్‌లో ఉన్నారు. కేసుల ఎత్తివేతకు సహకరిస్తానని మెసేజ్ చేశారు. వాటి ఆధారంగా లొకేషన్ గుర్తించిన పోలీసులు మార్చి 16న నిందితులు అనిల్, అనీక్షను అరెస్ట్ చేశారు. అదే నెల 27న అనీక్షకు కోర్టు బెయిలు మంజూరు చేసింది.