Amazon Forest: అమెజాన్ అడవుల్లో కూలిన చిన్న విమానం ప్రమాద ఘటన: ఆ పిల్లలు నలుగురూ క్షేమమే..!

Children Lost In Amazon Forest After Plane Crash Found Alive After 40 Days
  • 40 రోజుల తర్వాత పిల్లలను సజీవంగా గుర్తించిన సైనికులు 
  • పిల్లల ఫొటోతో కొలంబియా ప్రెసిడెంట్ ట్వీట్
  • వెంటనే ఇంటికి తెచ్చేసుకోవాలని పిల్లల తాతయ్య ఆత్రుత 
అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన పిల్లలు నలుగురూ దొరికారని కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో ప్రకటించారు. పిల్లలంతా క్షేమంగా ఉన్నారని ఆయన వెల్లడించడంతో దేశవ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. వందలాది మంది సైనికులతో చేపట్టిన ఆపరేషన్ హోప్ ముగిసిందని, సైనికులతో పాటు పిల్లలను వెతికేందుకు స్వచ్చందంగా అడవుల్లోకి వెళ్లిన వారికి ప్రెసిడెంట్ ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఆయన పిల్లల ఫొటోతో ట్వీట్ చేశారు.

40 రోజుల తర్వాత పిల్లలంతా క్షేమంగా దొరకడంతో దేశమంతా సంతోషం వ్యక్తమవుతోందని అందులో పేర్కొన్నారు. పిల్లలు దొరికిన విషయాన్ని వారి తాతయ్య కూడా నిర్ధారించారు. వారిని వెంటనే ఇంటికి తెచ్చేసుకోవడానికి అర్జెంటుగా తనకో విమానం కానీ హెలికాప్టర్ కానీ కావాలని ఫిడెన్సియో వాలెన్సియా చెప్పారు.

మే నెల 1వ తేదీన ఈ నలుగురు పిల్లలూ ప్రయాణిస్తున్న చిన్న విమానం అమెజాన్ అడవుల్లో కూలిపోయింది. అందులో పైలట్, ఆ పిల్లల తల్లి, మరొక బంధువు.. మొత్తం ముగ్గురూ చనిపోయారు. పిల్లలు నలుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 13, 9, 4 ఏళ్ల పిల్లలతో పాటు 11 నెలల పసివాడు కూడా ఇందులో ఉన్నాడు. విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించి అక్కడికి చేరుకోవడానికే రెస్క్యూ బృందాలకు రెండు వారాల సమయం పట్టింది.

దట్టమైన అడవుల్లో విమానం కూలిపోవడంతో గుర్తించడం కష్టమైందని అధికారులు తెలిపారు. తాము అక్కడికి చేరుకునే సరికి మృతదేహాలే తప్ప పిల్లలు కనిపించలేదని చెప్పారు. దీంతో ఆ పిల్లల కోసం వెతుకులాట కోసం ‘ఆపరేషన్ హోప్’ ప్రారంభించారు. కొలంబియా వాసులు ప్రతీ ఒక్కరూ పిల్లల క్షేమం కోసం ప్రార్థించారు. 40 రోజుల తర్వాత శుక్రవారం ఆ పిల్లలు నలుగురూ దొరికారని, వారంతా క్షేమంగానే ఉన్నారని కొలంబియా ప్రెసిడెంట్ ప్రకటించారు.
Amazon Forest
Plane Crash
children
Found Alive
After 40 Days
Colombia

More Telugu News