TDP: 2019లో అందువల్లే ఓడిపోయాం.. దేవినేని ఉమా
- పసుపు, కుంకుమ ఇచ్చాం కదాని కొంత నిర్లక్ష్యంగా ఉన్నామన్న ఉమా
- వైసీపీ వాళ్లు కాళ్లు గడ్డాలు పట్టుకుని గెలిచేశారని మాజీ మంత్రి ఎద్దేవా
- మైలవరం, నందిగామకు చెందిన వైసీపీ నేతలపై మండిపడ్డ ఉమా
పథకాలు ఇచ్చాం.. పసుపు, కుంకుమ ఇచ్చామని వీర తిలకాలు దిద్దుకుని ఊరేగామని, తమ పథకాలే గెలిపిస్తాయనే ధీమా వల్లే 2019 ఎన్నికల్లో ఓడిపోయామని టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం ఓటర్ల కాళ్లు పట్టుకుని ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రాధేయపడి గెలిచారని ఎద్దేవా చేశారు. ఆంధ్రా ఆడబిడ్డలకు పసుపు, కుంకుమ ఇచ్చామనే ధీమాతో ఉంటే, వైసీపీ వాళ్లు మాత్రం కాళ్లు గడ్డాలు పట్టుకుని గెలిపించండమ్మా అని ప్రాధేయపడడంతో ఓటర్లు జాలిపడి వారికి ఓటేశారన్నారు. ఈమేరకు దేవినేని ఉమా శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మైలవరం, నందిగామలో వైసీపీ నేతల దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోయిందని దేవినేని ఉమా విమర్శంచారు. మైలవరంలో తండ్రీ కొడుకులు ఇసుక దోచుకుంటున్నారని, మైలవరం, జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేలకు నెలకు రూ.7 కోట్లు పంపిస్తున్నారని ఆరోపించారు. కొండలు గుట్టలు దోచేసుకుంటున్నారని మండిపడ్డారు. నందిగామలో వసూలు బ్రదర్స్ ఇసుక దందా చేస్తూ నెలనెలా తాడేపల్లికి రూ.7 కోట్లు పంపుతున్నారని దేవినేని ఉమా ఆరోపణలు గుప్పించారు.