BJP: తెలంగాణలో బీజేపీ నాయకత్వ మార్పు? బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి
- బీజేపీ రాష్ట్ర చీఫ్ గా డీకే అరుణ
- పార్టీ ప్రచార సారథిగా ఇప్పటికే ఈటెల రాజేందర్ నియామకం
- నేతలలో అసంతృప్తి నేపథ్యంలో హైకమాండ్ నిర్ణయం
- ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం
తెలంగాణలో బీజేపీ నాయకత్వం మారనుందా?.. పార్టీలో నేతల మధ్య అసంతృప్తి పెరగడం, అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో రాష్ట్ర బీజేపీలో హైకమాండ్ మార్పులకు శ్రీకారం చుట్టిందా.. అంటే అవుననే వినిపిస్తోంది. పార్టీ అధినాయకత్వంలో మార్పులు తప్పవని ప్రచారం జరుగుతోంది. కీలక నేతల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు కీలక పదవుల్లో నేతలను సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు తెలంగాణ బాధ్యతలను అప్పగించాలని, ప్రస్తుతం పార్టీ తెలంగాణ చీఫ్ గా వ్యవహరిస్తున్న బండి సంజయ్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈటల రాజేందర్ కు పార్టీ ప్రచార సారథ్య బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలో మార్పులు చేసి, ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని పటిష్ఠం చేయాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర నేతలకు వరుసగా ఢిల్లీ నుంచి పిలుపులు అందుతున్నాయి. వరుసగా ఒక్కో నేత ఢిల్లీకి వెళ్లి వస్తుండడంతో రాష్ట్రంలో పార్టీ నాయకత్వ మార్పు జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా పర్యటనకు ముందే తెలంగాణ బీజేపీలో మార్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.