West Bengal: కిలో మామిడి రూ.2.75 లక్షలు! వీటి స్పెషాలిటీ ఏంటంటే...
- పశ్చిమబెంగాల్లోని సిలిగుడి జిల్లాలో మామిడి ప్రదర్శన
- ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా మియాజాకీ రకం మామిడి
- కిలో ధర ఏకంగా రూ.2.75 లక్షలు
- మియాజాకీ పళ్లలో తీపి శాతం ఇతర రకాల కంటే 15 శాతం అధికం
కిలో మామిడి ధర ఎంత ఉంటుందీ అంటే ఏ డెబ్బయ్యో వందో ఉంటుందని ఠకీమని చెబుతాం. మహా అయితే.. నాలుగొందల రూపాయలు కూడా ఉండొచ్చు. కానీ, ఒక రకం మామిడి ధర కిలో రూ.2.75 లక్షలు అంటే మీరేమంటారు? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! పశ్చిమబెంగాల్లో ఈ ఖరీదైన మామిడి అమ్మకానికొచ్చింది.
ప్రస్తుతం సిలిగుడి జిల్లా మటిగరా మాల్లో మామిడి పళ్ల ప్రదర్శన జరుగుతోంది. మొత్తం 262 రకాల పళ్లను ప్రదర్శనకు ఉంచారు. అయితే, వియాజాకీ రకం మామిడే అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వీటి ధర ఏకంగా రూ. 2.75 లక్షలు కావడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. సాధారణ పండ్ల కంటే వీటి పరిమాణం కాస్తంత ఎక్కువే కాకుండా తీపి శాతం కూడా 15 శాతం అధికంగా ఉంటుంది.
ఒక్కో పండు గరిష్ఠ బరువు 900 గ్రాముల వరకూ ఉంటుంది. మియాజాకీ రకం మామిడిని భారత్ సహా పలు ఆసియా దేశాల్లో సాగు చేస్తారు. ఇవి తొలుత జపాన్లోని వియాజాకీ నగరంలో బయటపడటంతో వీటికి ఈ పేరు స్థిరపడింది.