Team India: క్లారిటీ వచ్చేసింది.. ఆసియా కప్ లో ఇండియా, పాక్ పోరు పక్కా!

report says pakistan set to travel to india for world cup

  • పీసీబీ ప్రతిపాదించిన ‘హైబ్రిడ్ మోడల్’పై చర్చలు సఫలం
  • భారత్‌ ఆడే మ్యాచ్‌లు శ్రీలంకలో.. మిగిలినవి పాకిస్థాన్‌లో నిర్వహణ
  • త్వరలో ప్రకటన చేయనున్న ఏసీసీ చైర్మన్ జైషా
  • ప్రపంచ కప్‌ కోసం భారత్‌లో పర్యటించేందుకు ఒప్పుకున్న పాక్‌
  • రెండు టోర్నీల్లో దాయాదుల పోరు ఖాయమే

మన దేశంలో క్రికెట్ అంటే కేవలం ఆట కాదు.. ఓ మతం. దాయాది దేశం పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే కేవలం పోటీ కాదు.. ఓ యుద్ధమే. బంతులు రాకెట్లలా దూసుకొస్తుంటే.. మాటలు తూటాల్లా పేలుతుంటాయి. అందుకే రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే అంత క్రేజ్.

రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరిగి ఎన్నో ఏళ్లు గడిచింది. ఎప్పుడైనా ఐసీసీ టోర్నమెంట్లు జరిగితేనే రెండు దేశాల మధ్య మ్యాచ్ లు. త్వరలో ఆసియా కప్, ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్ జరగాల్సి ఉంది. ఆసియా కప్ వేదిక పాక్ కాగా.. ప్రపంచ కప్ వేదిక ఇండియా. ఇదే సందిగ్ధతకు కారణమైంది. పాకిస్థాన్ లో ఆడేదిలేదని బీసీసీఐ స్పష్టం చేస్తే.. ఇండియాలో జరిగే ప్రపంచకప్ ను బహిష్కరిస్తామని పీసీబీ చెప్పింది.

ఈ నేపథ్యంలో రెండడుగులు వెనక్కి వేసిన పాక్.. ‘హైబ్రిడ్ మోడల్’ను ప్రతిపాదించింది. ఇండియా ఆడే మ్యాచ్ లు వేరే దేశాల్లో, ఇతర మ్యాచ్ లు పాక్ లో నిర్వహించాలని పీసీబీ సూచించింది. దీనికి కూడా బీసీసీఐ అంగీకరించలేదు. దీంతో పాక్ లేకుండానే ఆసియా కప్ జరగడం ఖాయమేనని, ప్రపంచ కప్ ను పాక్ బాయ్ కాట్ చేస్తుందని వార్తలు వచ్చాయి. 

అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆసియా కప్‌, ప్రపంచ కప్‌ టోర్నీల్లో ఇరు దేశాల పోరు ఉంటుందని తెలుస్తోంది. ఆసియా కప్‌ కోసం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రతిపాదించిన ‘హైబ్రిడ్‌ మోడల్‌’కు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఏసీసీ చైర్మన్‌, బీసీసీఐ కార్యదర్శి జైషా మంగళవారం అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

ఆసియా కప్‌లో భారత్‌ ఆడే మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా.. మిగిలిన మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో నిర్వహించేలా పీసీబీ ప్రతిపాదనను తొలుత భారత్‌ సహా ఇతర దేశాలు వ్యతిరేకించాయి. పాక్‌ లేకుండానే శ్రీలంకలో అన్ని మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపింది. కానీ ఆసియా కప్‌ ప్రతినిధులతో పీసీబీ జరిపిన చర్చలు ఫలప్రదమైనట్లు తెలుస్తోంది. ప్రపంచ కప్‌ కోసం భారత్‌లో పర్యటిచేందుకూ పాక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవని పీసీబీ వర్గాలు తెలిపాయి. ఎలాంటి కండీషన్లు లేకుండా ప్రపంచకప్‌లో పాల్గొనేలా పీసీబీని ఒప్పించడంలో ఐసీసీ సీఈవో, చైర్మన్‌ సఫలీకృతమైనట్లుగా తెలుస్తోంది. 

‘‘హైబ్రిడ్‌ మోడల్‌ను పాక్‌ మినహా ఎక్కువ దేశాలు తొలుత ఆమోదించలేదు. అయితే ఒమన్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ పంకజ్‌ ఖిమ్జి ఆధ్వర్యంలో పరిష్కార మార్గం దొరికింది. పాక్‌ - నేపాల్, బంగ్లాదేశ్‌ - అఫ్గానిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ - శ్రీలంక, శ్రీలంక - బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతాయి. అలాగే భారత్‌ - పాకిస్థాన్‌ పోరుతోపాటు సూపర్ - 4లోని మ్యాచ్‌లను శ్రీలంకలోని పల్లెకెలె లేదా గాలె మైదానంలో నిర్వహించేందుకు అంగీకారం లభించింది’’ అని ఆసియా క్రికెట్‌ బోర్డు ప్రతినిధులు వెల్లడించారు.

ఆసియా కప్‌ సెప్టెంబర్‌లో జరగనుంది. సెప్టెంబర్ 2 నుంచి 17 దాకా కొనసాగనుంది. అక్టోబర్ నుంచి ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. దాదాపు నెలన్నరపాటు ఈ టోర్నీ కొనసాగనుంది.

  • Loading...

More Telugu News