Vellampalli Srinivasa Rao: అమరావతి అవినీతిలో బీజేపీ కూడా భాగస్వామే!: వెల్లంపల్లి ఫైర్
- వైసీపీపై బీజేపీ నేతలు బురద చల్లుతున్నారన్న వెల్లంపల్లి
- అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే ఏపీకి నిధులు ఇచ్చారని వ్యాఖ్య
- 2014 నుంచి 2019 వరకు చంద్రబాబుతో అంటకాగారని మండిపాటు
గత నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో అవినీతి తప్ప మరేం లేదంటూ విశాఖ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా వైసీపీపై బీజేపీ పెద్దల స్టాండ్ మారటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వైసీపీపై అమిత్ షా, జేపీ నడ్డాలు తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో... బీజేపీపై వైసీపీ నేతలు కూడా డైరెక్ట్ అటాక్ కు దిగుతున్నారు.
తాజాగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత రెండ్రోజుల నుంచి అమిత్ షా, నడ్డాలు ఏపీలో మీటింగ్ లు పెట్టి... రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని చెపుతూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏపీకి అన్ని నిధులిచ్చాం, ఇన్ని నిధులిచ్చామని అమిత్ షా చెప్పారని... అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే ఏపీకి కూడా ఇచ్చారని అన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు గురించి మాట్లాడాలని అన్నారు.
కేంద్రం ఇస్తున్న వాటికి జగన్ ఫొటో వేసుకుంటున్నారంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... అమ్మఒడి, చేయూత, ఫీజ్ రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ మీరు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబుతో మీరు అంటకాగింది నిజమా, కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు జరిగిన అవినీతిలో బీజేపీ కూడా భాగస్వామేనని ఆరోపించారు. అమరావతి భూముల అవినీతిలో కూడా బీజేపీ పాత్ర ఉందని విమర్శించారు. ఏపీలో బీజేపీకి ఓటు, సీటు లేవని ఎద్దేవా చేశారు.