saptagiri: రాజకీయాల్లోకి సప్తగిరి.. టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటన!

comedian saptagiri announced that he to join in tdp very soon
  • టీడీపీ కోసం అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తానన్న సప్తగిరి
  • చిత్తూరు జిల్లాలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి
  • ఇప్పటికే నారా లోకేశ్ ను పాదయాత్రలో కలిశానన్న స్టార్ కమెడియన్
తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు సినీ నటుడు, స్టార్ కమెడియన్ సప్తగిరి ప్రకటించారు. త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు ఆయన వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని లోక్ సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రకటన చేశారు. 

తనది చిత్తూరు జిల్లానే అని, ఐరాల ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టానని సప్తగిరి చెప్పారు. బంగారుపాళ్యం, పుంగనూరులో చదివానని తెలిపారు. ‘‘పేదల కష్టాలు నాకు తెలుసు. పేదలకు సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా నా వంతు కృషి చేస్తా’’ అని చెప్పారు. టీడీపీ నుంచి ఆఫర్ ఉన్నమాట వాస్తవమేనని, కాకపోతే ముందే చెప్పడం సరికాదని అన్నారు. మరో 10, 15 రోజుల్లో శుభవార్త చెబుతానని చెప్పారు.

టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏమి ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. టీడీపీ అధికారంలో రావడానికి తన సేవలు అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తానని, చిత్తశుద్ధితో పని చేస్తానని తెలిపారు. చంద్రబాబు డెవలప్‌మెంట్‌ను అందరూ చూశారని.. తాను ఎన్నికల్లో పోటీచేయడంపై పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇప్పటికే నారా లోకేశ్ ను పాదయాత్రలో కలిశానని చెప్పుకొచ్చారు.

‘‘నిజాయతీతో సినిమా రంగంలో అవకాశాలను దక్కించుకోగలిగాను. అలాగే రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటా. సినిమా వల్లే రాజకీయంగా అవకాశాలు వచ్చాయి. సినిమాలను వదిలేసేది లేదు’’ అని తెలిపారు. బొమ్మరిల్లు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సప్తగిరి అడుగుపెట్టారు. తర్వాత పరుగు, కందిరీగ, దరువు, గబ్బర్ సింగ్, జులాయి, ప్రేమ కథా చిత్రమ్, లవర్స్, రాజు గారి గది, ఎక్స్ ప్రెస్ రాజా, క్రాక్, వాల్తేరు వీరయ్య వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్ బీ సినిమాల్లో హీరోగానూ నటించారు.


saptagiri
Chandrababu
Nara Lokesh
TDP
Chittoor District

More Telugu News