MS Dhoni: కోహ్లీతో వివాదంపై క్లారిటీ ఇచ్చిన గౌతం గంభీర్
- గొడవ ఏదైనా మైదానానికే పరిమితమన్న గంభీర్
- వ్యక్తిగతంగా ఏదీ ఉండదని స్పష్టీకరణ
- మైదానంలో గొడవలు తనకు కొత్తకాదని వెల్లడి
గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ.. ఒకరు టీమిండియా మాజీ ఆటగాడు అయితే, ఒకరు ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాడు. వీరిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం ఇటీవలి ఐపీఎల్ సందర్భంగా వెలుగు చూడడం గుర్తుండే ఉంటుంది. గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్ కు మెంటార్ గా పనిచేస్తున్నాడు. విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టు సభ్యుడిగా ఉన్నాడు. మే 1న లక్నోలోని ఏక్ నా స్టేడియంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో లక్నో జట్టు బౌలర్ నవీనుల్ హక్, కోహ్లీ పరుష పదాలతో దూషించుకున్నారు. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలోకి వచ్చిన గంభీర్ కోహ్లీతో గొడవపడడం కనిపించింది.
దీనిపై న్యూస్18తో మాట్లాడిన సందర్భంగా గంభీర్ స్పందించాడు. తనకు, టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీకి మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. ‘‘నా అనుబంధం ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీతో ఒకే మాదిరిగా ఉంటుంది. మా మధ్య ఏదైనా వాగ్వివాదం చోటు చేసుకుంటే అది కేవలం మైదానానికే పరిమితం. అంతేకానీ బయట ఏమీ ఉండదు. వ్యక్తిగతంగా అక్కడ ఏమీ లేదు. నాలాగే వాళ్లు కూడా గెలవాలనుకుంటున్నారు’’ అని గంభీర్ చెప్పాడు.
‘‘క్రికెట్ మైదానాల్లో నేను ఎన్నోసార్లు గొడవలు పడ్డాను. నేను ఎప్పుడూ పోట్లాడలేదని చెప్పడం లేదు. కాకపోతే ఆ గొడవలు, పొట్లాటలు అనేవి కేవలం మైదానానికే పరిమితం అని చెప్పగలను. అది కూడా మైదానంలో ఇద్దరి మధ్యే పరిమితం. ఎంతో మంది ఏదో చెబుతారు. టీఆర్ పీ రేటింగుల కోసం దీనిపై వివరణ కావాలని చాలా మంది నన్ను అడుగుతుంటారు. ఇద్దరి మధ్య జరిగిన దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని గంభీర్ పేర్కొన్నాడు.