Sachin Tendulkar: అశ్విన్ ను ఎందుకు తీసుకోలేదో నాకైతే అర్థం కాలేదు.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమిపై సచిన్

i fail to understand sachin tendulkar slams indias wtc final team selection
  • డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఓడిపోయిన టీమిండియా
  • జట్టు సెలక్షన్‌, ప్లేయర్ల ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సచిన్ 
  • నంబర్ వన్ టెస్టు బౌలర్ అశ్విన్ ను తీసుకోకపోవడమేంటని ప్రశ్న
  • నైపుణ్యమున్న స్పిన్నర్లు ఎప్పుడూ టర్నింగ్‌ ట్రాక్‌లపైనే ఆధారపడరని వ్యాఖ్య
ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ లో వరుసగా రెండో సారి కూడా టీమిండియా బోల్తాపడింది. అప్పుడు లక్ష్యాన్ని కాపాడుకోలేక, ఇప్పుడు లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. రెండేళ్లు పడిన కష్టాన్ని ఆస్ట్రేలియాకు అప్పగించేసింది. దీంతో టార్గెట్ ఛేజింగ్ లో కనీస పోటీ ఇవ్వలేదంటూ రోహిత్‌ సేనపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌ కూడా జట్టు సెలక్షన్‌, ప్లేయర్ల ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తుది జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్‌ ను తీసుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేశాడు. నంబర్ వన్ టెస్టు బౌలర్ ను తీసుకోకపోవడమేంటని ప్రశ్నించాడు.

‘‘పోటీలో ఉండాలంటే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. భారత్‌ వైపు కొన్ని మంచి మూమెంట్స్‌ ఉన్నాయి. కానీ ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ టెస్టు బౌలర్‌గా కొనసాగుతున్న అశ్విన్‌ను ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కాలేదు’’ అని సచిన్‌ పేర్కొన్నాడు.

‘‘సీమర్లకు సహకరించే పిచ్‌ అని చెప్పి అశ్విన్‌ నైపుణ్యాలను ఉపయోగించుకోకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను గతంలో చెప్పినట్లుగానే.. నైపుణ్యం ఉన్న స్పిన్నర్లు ఎప్పుడూ టర్నింగ్‌ ట్రాక్‌లపైనే ఆధారపడరు. వారు పరిస్థితులను ఉపయోగించుకుని బంతుల్లో వైవిధ్యాన్ని చూపుతారు. ఆసీస్‌ టాప్‌ 8 బ్యాటర్లలో ఐదుగురు లెఫ్ట్‌ హ్యాండర్లన్న విషయాన్ని మరవకూడదు’ అని సచిన్‌ వివరించాడు.

కాగా, అశ్విన్‌ను తీసుకోకపోవడాన్ని కోచ్‌ ద్రవిడ్‌ సమర్థించుకున్నాడు. మేఘావృతమైన పరిస్థితుల కారణంగానే తాము నాలుగో స్పెషలిస్ట్‌ సీమర్‌తో బరిలోకి దిగాల్సి వచ్చిందని చెప్పాడు. కానీ ఉమేశ్ యాదవ్ పెద్దగా ప్రభావం చూపలేదు. అశ్విన్ ఉండుంటే.. బ్యాటింగ్ పరంగానూ టీమిండియాకు కలిసొచ్చేది.
Sachin Tendulkar
WTC Final
Team India
Ravichandran Ashwin
Rahul Dravid
Australia

More Telugu News