Gudivada Amarnath: వైసీపీ, బీజేపీ మధ్య బంధం ఉందని అపోహపడ్డారు: మంత్రి గుడివాడ అమర్నాథ్
- జేపీ నడ్డా, అమిత్ షా వ్యాఖ్యలతో భగ్గుమంటున్న వైసీపీ మంత్రులు
- స్టీల్ ప్లాంట్ గురించి అమిత్ షా ఒక్క మాటా మాట్లాడలేదన్న అమర్నాథ్
- కేంద్రం ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చిందేమిటో చెప్పాలన్న మంత్రి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా ఏపీకి వచ్చి మరీ తమ ప్రభుత్వాన్ని విమర్శించడంపై వైసీపీ మంత్రులు భగ్గుమంటున్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అమిత్ షా ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు.
ఇప్పటివరకు అందరూ బీజేపీ, వైసీపీ మధ్య చెలిమి ఉందని అపోహపడ్డారని తెలిపారు. అలాంటిదేమీ లేదన్న విషయం బీజేపీ నేతల వ్యాఖ్యలతో స్పష్టమైందని వివరించారు. మరే ఇతర పార్టీపైనా ఆధారపడాల్సిన స్థితిలో వైసీపీ లేదని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.
"కేంద్రం ఎంతో దయతో రాష్ట్రానికి పథకాలు ఇస్తున్నట్టు అమిత్ షా చెప్పారు. రాష్ట్రం చెల్లించే పన్నుల వాటా నుంచే కేంద్రం ఆ నిధులు ఇస్తోంది. ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చింది ఏమిటో ఢిల్లీ పెద్దలు చెప్పాలి. స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదాపై కేంద్రం ఏపీకి చేసిందేమీ లేదు. పోలవరం విషయంలోనూ కేంద్రం సాయం చేయడంలేదు. ఒక్క సీటు కూడా లేకుండానే, వాళ్లకు 20 సీట్లు కావాలట!" అంటూ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు.