Suresh Raina: మళ్లీ బ్యాట్ పట్టనున్న రైనా.. ఆ లీగ్ లో ఎంట్రీకి రెడీ

Suresh Raina named in Lanka Premier League 2023 player auction list
  • లంక ప్రీమియర్ లీగ్ ఆడనున్న సురేశ్ రైనా
  • బుధవారం జరిగే ఆటగాళ్ల వేలం జాబితాలో చోటు
  • ఐపీఎల్ లో మంచి పేరు తెచ్చుకున్న రైనా  
భారత జట్టు మాజీ క్రికెటర్‌, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడైన సురేశ్ రైనా విదేశీ లీగ్స్ లో ఆడేందుకు సిద్ధం అవుతున్నాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా ముందుగా శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించే లంక ప్రీమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)లో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. బుధవారం జరిగే ఎల్‌పీఎల్‌ 2023 సీజన్‌ ఆటగాళ్ల వేలం జాబితాలో రైనాకు చోటు దక్కింది. ఈ  మేరకు జులై 31 నుంచి ఐదు జట్లు పోటీ పడే లీగ్‌ కోసం వేలంలోకి వచ్చిన అంతర్జాతీయ, దేశవాళీ క్రికెటర్ల జాబితాను శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ) విడుదల చేసింది. 

36 ఏళ్ల సురేశ్ రైనా భారత్ తో పాటు ఐపీఎల్ లో సత్తా చాటాడు. ముఖ్యంగా ఐపీఎల్ లో తన బ్యాటింగ్ మెరుపులతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ తరఫున ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడిన రైనా 5500 పైచిలుకు పరుగులు సాధించాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం  అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చిన ఆటగాళ్లు విదేశీ లీగుల్లో ఆడొచ్చు. రెండేళ్ల నుంచి ఆటకు దూరమైన రైనా ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. లంక లీగ్ కోసం అతను మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు.
Suresh Raina
IPL
Lanka Premier League
Cricket

More Telugu News