Bandi Sanjay: బండి సంజయ్-కవిత మధ్య ట్విట్టర్ వార్
- గవర్నర్ కు గౌరవం దక్కదు అంటూ బండి సంజయ్ విమర్శలు
- గిరిజన మహిళా రాష్ట్రపతికి గౌరవం దక్కదంటూ కవిత కౌంటర్
- పరస్పరం విపక్ష ప్రభుత్వాలపై విమర్శలు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బండి సంజయ్ ఉదయం ట్వీట్ చేశారు. దీనికి కవిత అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
ఉదయం బండి సంజయ్ ట్వీట్ చేస్తూ... గవర్నర్ కు గౌరవం దక్కదు.. ఆడబిడ్డలకు లేదు అండ.. గిరిజన మహిళలపై పోలీస్ గిరీ, బతుకమ్మను అవమానించిన వాడితో ఆలింగనం.. ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతవ్ అడ్డం... అదిరింది కేసీఆర్ నీ మహిళా సంక్షేమం అంటూ ఎద్దేవా చేశారు.
దీనిపై కవిత కౌంటర్ ట్వీట్ చేశారు. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి గౌరవం దక్కదు... మహిళా రెజ్లర్లు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు.. నినాదాలకే పరిమితమైన భేటీ బచావో... బేటీ పడావో.. సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కన్నీరు తెప్పిస్తున్న దుస్థితి... మహిళా విద్య, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం.. ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం.. ఆడబిడ్డ తలుచుకుంది.. ఇక మీ అడ్రస్ గల్లంతవుతుందని కవిత ట్వీట్ చేశారు.