Sunil Gavaskar: డబ్ల్యూటీసీ ఫైనల్లో 3 మ్యాచ్ లు ఉండాలన్న రోహిత్ శర్మ... సెటైర్ వేసిన గవాస్కర్
- డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఘోర పరాజయం
- ఫైనల్లో 3 టెస్టులు ఉండాలన్న రోహిత్ శర్మ
- రేపు అందులో కూడా ఓడిపోతే 5 టెస్టులు అంటారేమోనన్న గవాస్కర్
- విండీస్ వంటి జట్లపై గెలవడం కాదు... ఆసీస్ ను ఓడించాలన్న క్రికెట్ దిగ్గజం
ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో చిత్తవడం తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఫైనల్లో ఒకే టెస్టు ఉండడం సరికాదని, డబ్ల్యూటీసీ ఫైనల్ ను కూడా 3 టెస్టుల సిరీస్ లాగా నిర్వహించాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు.
అయితే దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సెటైర్ వేశారు. ఇప్పుడు 3 టెస్టులు అంటారు... రేపు అందులో కూడా ఓడిపోతే అప్పుడు 5 టెస్టుల సిరీస్ అడుగుతారేమో అని ఎద్దేవా చేశారు.
"ఐపీఎల్ ఫైనల్ ను కూడా ఇలాగే 3 మ్యాచ్ లుగా జరపాలని అడుగుతున్నారా...? లేదు కదా. ఐపీఎల్ ఫైనల్ కు ఎలా సిద్ధమవుతారో, డబ్ల్యూటీసీ ఫైనల్ కు కూడా అలాగే సిద్ధం కావాలి. ఫైనల్లో ఒకే టెస్టు ఉంటుందన్న విషయం మీకు టెస్టు చాంపియన్ షిప్ సీజన్ ప్రారంభం నుంచే తెలుసు. మానసికంగా ముందే సిద్ధం కావాల్సిందే" అని గవాస్కర్ స్పష్టం చేశారు.
ద్వైపాక్షిక సిరీస్ ల్లో విండీస్ వంటి జట్లపై 2-0, 3-0 తేడాతో గెలవడం కాదు... ఆసీస్ వంటి పెద్ద జట్లపై గెలవాలని స్పష్టం చేశారు. విండీస్ వంటి జట్లపై విజయాలు సాధించి టీమిండియా మళ్లీ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినా... తప్పులు సరిదిద్దుకోకపోతే ఆసీస్ చేతిలోనే మరోసారి పరాజయం ఎదురుకావొచ్చు అని గవాస్కర్ వ్యాఖ్యానించారు.
కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్ ను బెస్ట్ ఆఫ్ త్రీ పద్ధతిలో నిర్వహించాలన్న రోహిత్ శర్మ ప్రతిపాదనను ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ వ్యతిరేకించాడు. ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్ లో కూడా స్వర్ణ పతకం కోసం ఫైనల్లో సింగిల్ రేసు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశాడు.