Madiga: మాదిగల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యం... అగ్రనేతల స్పష్టీకరణ
- టీడీపీ ప్రధాన కార్యాలయంలో మాదిగల ఆత్మీయ సమావేశం
- హాజరైన అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, పిల్లి మాణిక్యరావు తదితరులు
- టీడీపీ మాదిగల పార్టీ అని నేతల వెల్లడి
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మాదిగల ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సారథ్యంలో, రాష్ట్ర ఎస్సీ, సెల్ అధ్యక్షుడు ఎమ్.ఎస్. రాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... స్వాతంత్ర ఫలాలు దేశంలో పేదవారు పొందాలి, ముఖ్యంగా దళిత జాతికి అందాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారని వెల్లడించారు.
"స్వాతంత్ర్యం వచ్చాక దాదాపు 30 సంవత్సరాలపాటు పార్టీలకు సేవకులుగానే దళిత వర్గాలు మెలిగాయి. 1982 నుండి దళితులకు అవకాశాలు వచ్చాయి. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత దళిత వర్గానికి అందులో ముఖ్యంగా మాదిగ వర్గాలకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలు లభించాయి. ఎన్టీ రామారావు మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకు తెలుగుదేశం పార్టీ దళితులకు సామాజిక న్యాయం చేస్తూ వచ్చింది.
ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఆలోచనతో 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విభజన చట్టం తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మాదిగలకు దామాషా ప్రకారం రాజకీయంగా, ఆర్థికంగా అందరికి అన్ని అవకాశాలు కల్పిస్తుంది" అని వివరించారు.
పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య మాట్లాడుతూ... ఈ రోజు తెలుగుదేశం ప్రాంగణమంతా మాదిగలతో నిండి ఉందని అన్నారు. తిన్నా, తినకపోయినా క్రమశిక్షణకు మారుపేరు నా మాదిగ జాతి అని భావోద్వేగాలతో వ్యాఖ్యానించారు.
"మండుటెండలను లెక్కచేయకుండా వచ్చారు... తెలుగుదేశం మాదిగల పార్టీ అని చాటి చెప్పారు. గతంలో సామాజికంగా దగాపడ్డ జాతికి న్యాయం చేయాలని వర్గీకరణ కోసం సోదరుడు మంద కృష్ణ ఉద్యమం చేశారు. ఆ ఉద్యమ ఫలితాలు నాలుగు సంవత్సరాలు అనుభవించాం. తెలుగుదేశం పార్టీలో మాదిగలు మళ్లీ తప్పకుండా కీలక పాత్ర పోషిస్తారు.
మా ఉనికిని మేము కాపాడుకోవడానికి మాకు తెలుగుదేశం పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబును కోరాం. జీవో నెం.25 నూటికి నూరు పాళ్లు అమలు చేయాలని చంద్రబాబును కోరాం. ఆయన దానికి అంగీకరించి వర్గీకరణకు సహకరిస్తామని చెప్పారు. కార్పొరేషన్ల విషయంలో కూడా మాదిగలకు పెద్దపీట వేస్తానని చెప్పడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ మహా కార్యక్రమం ఏర్పాటు చేశాం.
మాదిగలంతా ఐక్యంగా కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలి. రాష్ట్రంలో నా మాదిగ జాతికి అన్యాయం చేసిన జగన్ రెడ్డి అంతు చూద్దామని కదిలి వచ్చిన నా మాదిగ జాతికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని తెలిపారు.
1982-83 నాటికి ఈ రాష్ట్రంలో మాదిగ జాతి చెప్పులు కుట్టుకునే దగ్గర, డప్పు కొట్టుకునే దగ్గర ఉందన్నది స్పష్టంగా అర్థమవుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అన్నారు.
"ఆరుంధతి ఉద్యమం, దండోరా ఉద్యోమం... ఈ రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు పుట్టాయి. కానీ, మాదిగలకు రాజకీయ చైతన్యం తెచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీనే.ఈ రాష్ట్రానికి ఒక రాక్షసుడు ముఖ్యమంత్రి అయ్యాడు. దీనివల్ల ముందుగా నష్టపోయేది మాదిగలేనని గుర్తుచేస్తున్నా. మాదిగలకు రాజకీయంగా, ఆర్థికంగా చైతన్యం రావాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే" అని వెల్లడించారు.