Gujarat: ముంచుకొస్తున్న ‘బిపర్జాయ్’ తుపాన్.. హైఅలర్ట్‌లో గుజరాత్
- గురువారం సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో తీరం దాటనున్న తుపాను
- ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
- తీర ప్రాంతాల్లోని 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
- సహాయ చర్యల కోసం కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, ఆర్మీ సంసిద్ధం
బిపర్జాయ్ తుపాను రేపు తీరం దాటనున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏ పరిస్థితినైనా ఎదుర్కునేందుకు వీలుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం బిపర్జాయ్ తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో పోర్ బందర్‌కు నైరుతివైపు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గురువారం సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో తుపాన్ తీరం దాటనుంది.
మంగళవారం గుజరాత్ అధికారులు తీర ప్రాంతాల్లోని సుమారు 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్ర, కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచారు. సహాయక చర్యల్లో పాలుపంచుకునేందుకు సైన్యాన్ని కూడా రంగంలోకి దించనున్నారు. రాష్ట్రంలో సహాయక ఏర్పాట్లపై మంగళవారం హోం మంత్రి అమిత్ షా వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో సహాయక కార్యక్రమాలు చేపడుతోంది. తొలి విడతలో భాగంగా తీరానికి 5 కిలోమీటర్ల లోపు ఉన్నవారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెండో విడతలో తీరానికి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న వారిని తరలిస్తారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం మొత్తం 17 కేంద్ర, 12 రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచారు. తుపాను సమయంలో ప్రజల భద్రత దృష్ట్యా రైల్వే శాఖ ఇప్పటికే 69 రైళ్లను రద్దు చేసింది. మరో 58 రైళ్ల ప్రయాణాన్ని కుదించింది. ఈ మేరకు రైళ్లు బయలుదేరే స్టేషన్, గమ్యస్థానాలకు మార్పులు చేసింది.
గురువారం తుపాను తీరం దాటే సమయంలో గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అహ్మదాబాద్ కార్యాలయం డైరెక్టర్ మనోరమా మహంతి పేర్కొన్నారు. సౌరాష్ట్ర-కచ్ ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు, కచ్, పోర్ బందర్, దేవ్‌భూమి ద్వారకా ప్రాంతాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు.