Pawan Kalyan: ఒక్క చాన్స్... గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి: పవన్ కల్యాణ్
- 25 ఏళ్లు ఈ గడ్డపైనే ఉంటానన్న పవన్
- కచ్చితంగా మార్పు తీసుకువస్తానని ఉద్ఘాటన
- ఈసారి కులాలను చూడొద్దని విజ్ఞప్తి
- జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరిన జనసేనాని
వచ్చే 25 ఏళ్లు తాను ఈ గడ్డపైనే ఉంటానని, కచ్చితంగా మార్పు తీసుకువస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.
జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి... గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి... ఈసారి కులాలను చూడకండి... మీకోసం పనిచేసే వ్యక్తిగా నన్ను చూడండి... జనసేన అభ్యర్థులను గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు.
"నేను కేసులు ఉన్న వ్యక్తిని కాదు. కేంద్ర నాయకులను గౌరవిస్తాను కానీ వారికి భయపడను. నేను రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నాను... మమ్మల్ని గెలిపించండి. పవన్ కల్యాణ్ అనేవాడు ఎవరికీ భయపడడని గుర్తుంచుకో ముఖ్యమంత్రి జగన్ అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.
అన్నింటికీ తెగించే వచ్చాను... చేతనైతే మంచిగా పాలించు... లేకపోతే మాదైన రోజున కింద కూర్చోబెడతాను జాగ్రత్త అని హెచ్చరించారు. గాంధీజీలా ఓ చెంప చూపించే రోజులు పోయాయని, ఎదిరిస్తాం అని స్పష్టం చేశారు.
పవన్ ప్రసంగం హైలైట్స్...
- నేను ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడను అని మాటిస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో జనసేనకే ఓటేయండి. గోదావరి తల్లి సాక్షిగా మీకు అండగా నిలుస్తాను.
- కాపు నాయకులు ఆలోచించండి... వైసీపీ కాపులను మోసం చేస్తోంది, కాపుల మధ్య చిచ్చుపెడుతోంది. కాపు నేతలు మాకు అండగా నిలవండి.
- మేం బీజేపీతో కలిసి ఉన్నాం కాబట్టి అండగా నిలవబోమని, వైసీపీ వైపే ఉంటామని ముస్లిం నాయకులు అంటారు. కానీ బీజేపీకి అన్ని విషయాల్లో మద్దతుగా నిలబడింది వైసీపీనే. మరి ముస్లింలు వారికెలా అండగా ఉంటారు?
- నిజంగా బీజేపీ అండగా లేకపోతే, కేంద్రం వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు నిధులు ఇస్తుంది?
- పార్టీలో కొందరు తప్పు చేస్తే నిర్మొహమాటంగా తీసేశాను.
- నా కష్టార్జితంతో, నన్ను అభిమానించేవారు ఇచ్చే విరాళాలతో పార్టీ నడుపుతున్నాను.
- నేను పోటీ చేసే చోట రూ.200 కోట్లు ఖర్చుపెడతామంటున్నారు... అదంతా దోపిడీ చేసిన డబ్బు.
- జనసేన షణ్ముఖ వ్యూహం ద్వారా... ప్రతిభ ఉండి, ఉపాధి కల్పించే ప్రణాళిక ఉండి, పెట్టుబడి లేక ఇబ్బందులు పడే యువతకు సాయం అందిస్తాం. ప్రతి నియోజకవర్గం నుంచి 500 మంది యువతకు వన్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్ కింద రూ.10 లక్షలు ఇస్తాం.
- ఏపీ భవిష్యత్తు గోదావరి జిల్లాల చేతిలో ఉంది... దయచేసి అర్థం చేసుకోండి. మాకు అండగా నిలబడండి.