Greater Noida: నైటీలు, లుంగీలతో బయటకు రావొద్దు.. ఆదేశాలు జారీ చేసిన గ్రేటర్ నోయిడా అపార్ట్మెంట్ రెసిడెంట్స్ అసోసియేషన్
- గ్రేటర్ నోయిడా సెక్టార్ 2లో ఓ అపార్ట్మెంట్ నిర్ణయం
- వదులైన దుస్తులు ధరించి తిరుగుతుండడంపై ఫిర్యాదులు
- నోటిమాటగా చెప్పినా లెక్క చేయకపోవడంతో సర్క్యులర్ జారీ
నైటీలు, లుంగీలు ధరించి అపార్ట్మెంట్ పరిసరాల్లో తిరగొద్దంటూ గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్మెంట్ నిర్వాహకులు జారీ చేసిన సర్క్యులర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడి సెక్టార్ 2లోని హిమసాగర్ అపార్ట్మెంటులోని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ నెల 10న ఓ సర్క్యులర్ జారీ చేస్తూ.. అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో తిరిగే సమయంలో మీ దుస్తులు, ప్రవర్తనపై ప్రత్యేక శద్ధ పెడతారని ఆశిస్తున్నట్టు పేర్కొంది. మంచి దుస్తులు ధరించడం ద్వారా మీ ప్రవర్తనను ఎవరూ తప్పుపట్టకుండా చూసుకోవాలని సూచించింది.
ఇంట్లో వేసుకునే నైటీలు, లుంగీలు ధరించి ఎవరూ బయట తిరగవద్దని అందులో కోరింది. వివక్షతో ఈ ఆదేశాలు జారీ చేయలేదని, వదులైన దుస్తులు ధరించి కొందరు అపార్ట్మెంట్ పరిసరాల్లో యోగా వంటివి చేస్తుండడంపై ఫిర్యాదులు అందాయని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ సీకే కల్రా తెలిపారు. తొలుత వారికి నోటిమాటగా చెప్పినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడం వల్లే ఈ సర్క్యులర్ జారీ చేసినట్టు తెలిపారు.