Rajesh Das: లైంగిక వేధింపుల కేసులో తమిళనాడు మాజీ డీజీపీకి జైలు శిక్ష!
- తనను మాజీ డీజీపీ రాజేశ్ దాస్ లైంగికంగా వేధించారంటూ మహిళా ఐపీఎస్ ఫిర్యాదు
- ఆయన్ను దోషిగా తేల్చిన విల్లుపురం కోర్టు
- మూడేళ్ల కఠిన కారాగార శిక్ష.. రూ.10 వేల జరిమానా విధింపు
- రాజేశ్ దాస్ కు సహకరించిన ఎస్పీకి రూ.500 జరిమానా
లైంగిక ఆరోపణల కేసులో తమిళనాడు మాజీ డీజీపీ రాజేశ్ దాస్ దోషిగా తేలారు. తన తోటి మహిళా పోలీసు అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ విల్లుపురం కోర్టు ఆయనకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.10 వేల జరిమానా కూడా వేసింది. అయితే ఈ తీర్పుపై 30 రోజుల్లో ఆయన అప్పీలుకు వెళ్లచ్చని పేర్కొంటూ, బెయిల్ కూడా మంజూరు చేసింది.
ఇదే కేసులో అప్పటి చెంగల్‌పట్టు ఎస్పీ కన్నన్‌కూ న్యాయస్థానం జరిమానా విధించింది. రాజేశ్ దాస్‌పై ఫిర్యాదు చేసేందుకు చెన్నై వెళ్తున్న బాధిత మహిళా అధికారిని అడ్డుకున్నందుకు ఆయన్ను దోషిగా తేల్చింది. రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో పోలీసు సిబ్బంది సహా 68 మంది వ్యక్తుల వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది.
ఐపీఎస్ అధికారి రాజేశ్ దాస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ 2021 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామి సభకు బందోబస్తు నిర్వహించేందుకు వాహనంలో వెళ్తున్న సమయంలో తనను లైంగికంగా వేధించారని పేర్కొన్నారు. దీనిపై చర్యలు చేపట్టిన నాటి అన్నాడీఎంకే ప్రభుత్వం.. రాజేశ్ దాస్‌ను సస్పెండ్ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీతో ఈ వ్యవహారంపై విచారణ జరిపించింది. ఘటన జరిగిన సమయంలో తమిళనాడు స్పెషల్ డీజీపీ హోదాలో రాజేశ్ దాస్ ఉన్నారు.