Sukesh Chandrashekhar: ఒడిశా ప్రమాద బాధితులకు రూ.10 కోట్లు ఇస్తా.. ఆర్థిక నేరగాడు సుఖేశ్ ప్రకటన

Conman Sukesh Chandrashekhar wants to donate Rs 10 cr for Odisha train tragedy victims

  • మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్
  • తాను విరాళం ఇచ్చేందుకు అనుమతివ్వాలని రైల్వే మంత్రికి లేఖ
  • బాధ్యతాయుతమైన పౌరుడిగా సాయం చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడి
  • చట్టబద్ధంగా సంపాదించిన మొత్తాన్ని ఇస్తానని ప్రకటన

అతడో ఆర్థిక నేరగాడు.. వందల కోట్ల మనీ లాండరింగ్ కేసులో విచారణ ఖైదీగా జైలులో ఉన్నాడు.. అప్పుడప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులపై సంచలన ఆరోపణలు చేస్తుంటాడు.. ప్రియురాలిగా చెప్పుకునే హీరోయిన్ కు ప్రేమ లేఖలు కూడా రాస్తుంటాడు. ఇప్పుడేమో తనలోని మానవత్వాన్ని బయటపెట్టాడు. అతడే సుఖేశ్ చంద్రశేఖర్!! ఒడిశా రైలు ప్రమాద బాధితులకు సాయంగా రూ.10 కోట్లు ఇవ్వనున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. 

ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ రాశాడు. రూ.10 కోట్లను విరాళంగా బాధితులకు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. తాను వ్యక్తిగతంగా, చట్టబద్ధంగా సంపాదించిన మొత్తాన్ని ఇస్తానని పేర్కొన్నాడు. రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువు కోసం ఆ మొత్తాన్ని వినియోగించాలని విజ్ఞప్తి చేశాడు. 

‘‘మన ప్రభుత్వం ఇప్పటికే బాధిత ప్రజలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందజేస్తోంది. ఒక బాధ్యతాయుతమైన, మంచి పౌరుడిగా.. రూ. 10 కోట్లను ఆ కుటుంబాలు/పిల్లలు, భావి యువత కోసం ప్రత్యేకంగా వినియోగించే నిధిగా అందిస్తున్నాను. తమ ప్రియమైన వ్యక్తిని/కుటుంబాన్ని పోషించే వారిని కోల్పోయిన వారి చదువుల ఖర్చుల కోసం కేటాయించాలని కోరుతున్నా’’ అని లేఖలో రాసుకొచ్చాడు. 

ఇక ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది చనిపోగా, 1200 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు స్పష్టమైన కారణమేంటనేది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

  • Loading...

More Telugu News