tspsc: టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాన్ని పునఃపరిశీలించాలి: హైకోర్టు కీలక ఆదేశాలు

High Court orders to review TSPSC members appointment
  • సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పిటిషన్
  • ఆరుగురు సభ్యుల నియామకంపై ప్రభుత్వానికి ఆదేశాలు
  • సభ్యుల విశిష్టతలు, అర్హతలను పరిశీలించి, మూడు నెలల్లో కసరత్తు పూర్తి చేయాలని సూచన
టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకంపై హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. ఆరుగురు టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎ. వినాయక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, శుక్రవారం విచారణ జరిగింది.

టీఎస్‌పీఎస్సీ సభ్యులను నియమిస్తూ 2021 మే 19న రాష్ట్ర ప్రభుత్వం జీవో 18ని జారీ చేసిందని, నిబంధనల మేరకు ఆరుగురు సభ్యులకు అర్హతలు, విశిష్టతలు లేవని కోర్టుకు తెలిపారు. కోర్టు నేడు వాదనలు విన్న అనంతరం బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి, ఆర్. సత్యనారాయణ, రమావత్ ధన్ సింగ్, సుమిత్ర ఆనంద్ తనోబా, అరవెల్లి చంద్రశేఖర్ల నియామకాన్ని పరిశీలించాలని ఆదేశించింది.

ఈ ఆరుగురు సభ్యుల విశిష్టతలు, అర్హతలను పరిశీలించాలని, మూడు నెలల్లో ఈ కసరత్తు పూర్తి చేయాలని సూచించింది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల శక్తి సామర్థ్యాలు ప్రజల్లో విశ్వాసం నింపేలా ఉండాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.
tspsc
High Court

More Telugu News