Manipur: మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. కేంద్రమంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి

Union minister RK Ranjan Singhs house attacked with petrol bombs

  • మీటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్
  • ఆందోళనకారుల దాడిలో ధ్వంసమైన కేంద్రమంత్రి ఇల్లు
  • అడ్డుకోలేకపోయిన సెక్యూరిటీ సిబ్బంది
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్న మంత్రి
  • కష్టార్జితంతో కట్టిన ఇళ్లు ధ్వంసం చేశారని ఆవేదన

మీటీ, కుకీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో హింసకు తెరపడడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకీ మరింత క్షీణిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రమంతి ఇంటిపై దాడిచేసిన ఆందోళనకారులు తాజాగా ఇంఫాల్‌లోని విదేశాంగశాఖ సహాయమంత్రి ఆర్‌కే రంజన్‌సింగ్ ఇంటిని ధ్వంసం చేశారు. 1200 మందికిపైగా ఆందోళనకారులు కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి మరీ రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. మంత్రి ఇంటిని చుట్టుముట్టి పెట్రోలు బాంబులతో దాడిచేశారు. ఈ దాడిలో మంత్రి ఇల్లు అగ్నికి పూర్తిగా ఆహుతైంది. ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

ఆ సమయంలో మంత్రి ఇంటి వద్ద 22 మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులను నిలువరించలేకపోయారు. మే నెలలోనూ మంత్రి ఇంటిపై దాడి జరిగినా భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపు చేశారు. కాగా, గురువారం మధ్యాహ్నం ఆందోళనకారులు మరో రెండు ఇళ్లకు నిప్పు పెట్టారు. తన ఇంటిపై జరిగిన దాడి గురించి తెలిసిన కేంద్రమంత్రి రంజన్ కేరళ నుంచి వెంటనే తిరుగుపయనమయ్యారు. కష్టార్జితంతో కట్టుకున్న ఇంటిని ధ్వంసం చేయడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. తాను అవినీతిపరుడిని కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News